ఏళ్ల తరబడి కష్టపడినా రాని గుర్తింపు, హైప్ ఒక్కరోజులో వస్తే ఎలా ఉంటుంది. చాలా గొప్పగా ఉంటుంది. అయితే ఈ ఒక్కరోజులో గుర్తింపు మంచిగా అయితే రాదు. ఏదో ఒక వంకర పని చేస్తేనే వస్తుంది. ఎప్పుడైనా మంచి కంటే చెడే పదడుగులు ముందుగా పరిగెడుతుంటుంది కదా. ఈ లాజిక్కునే తెలంగాణ బీజేపీ నేతలు బిర్రుగా పట్టుకున్నారు. ఎన్నికల వేళ పార్టీ మారి వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా బీజేపీ నేత రావుల శ్రీధర్ రెడ్డి తెరాస తీర్థం పుచ్చుకున్నారు. దశాబ్ద కాలంగా బీజేపీలో పనిచేసిన ఈయన ఉన్నపళంగా పార్టీ మారిపోయారు.
మామూలు రోజుల్లో అయితే ఈయన పార్టీ మారడం అంత ముఖ్యమైన వార్త అయ్యేది కాదు. కానీ దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో మారడంతో హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం దుబ్బాకలో తెరాస, కాంగ్రెస్, బీజేపీల మధ్యన హోరాహోరీ పోటీ నెలకొంది. మొదట్లో తెరాసనే గెలుస్తుందని అనుకున్నా, ఆ తర్వాత కాంగ్రెస్ హైలెట్ అయినా ఇప్పుడు మాత్రం బీజేపీ హడావిడి కనిపిస్తోంది. అందుకు కారణం గత వారం పది రోజులుగా చోటు చేసుకున్న అంశాలే. బండి సంజయ్ అరెస్ట్ కావడం, కిషన్ రెడ్డి రంగంలోకి దిగడం, రఘునందన్ రావు టార్గెట్ కావడం, కేసీఆర్, హరీష్ రావు సహా అందరూ బీజేపీని తీవ్రంగా పరిగణించడంతో ఈ సీన్ క్రియేట్ అయింది.
అసలు రేసులోనే లేని రఘునందన్ రావు మీద కూడ గెలుపు అంచనాలు మొదలయ్యాయి. మొత్తానికి ఎన్నడూ లేని రీతిలో బీజేపీ ప్రచారం పొందింది. దీన్ని ఆసరాగా తీసుకున్న రావుల శ్రీధర్ రెడ్డి పెద్ద మీడియా మీట్ పెట్టి పార్టీ మారుతున్నట్టు ప్రకటించారు. నిజానికి ఈయన మార్పు దుబ్బాక ఎన్నికల మీద కాదు కదా గ్రేటర్ ఎన్నికల్లో కూడ ఎఫెక్ట్ చూపదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుండి పోటీచేసిన ఈయనకు కనీసం పదివేల ఓట్లు కూడ రాలేదు. ఈయనకంటే ఇండిపెండెంట్ అభ్యర్థి నవీన్ యాదవ్ రెట్టింపు ఓట్లు గెలుచుకున్నారు. అలాంటి ఆయన సరిగ్గా టైమింగ్ చూసి పార్టీ మారడంతో హీరో అయిపోయారు. మరి ఈయన స్ట్రాటజీని ఇంకెంతమంది బీజేపీ లీడర్లు పాటిస్తారో చూడాలి.