కరోనా ఎఫెక్ట్ తెలంగాణ సీఎం కేసీఆర్ పై గట్టిగానే పడింది. పరీక్షలు చేయడంలో ప్రభుత్వం అలసత్వం..దొంగ లెక్కలు చూపించడం సహా ఇటీవలే ఎదురైనా పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ పై ప్రజల్లో కొంత వ్యతిరేకత అయితే వ్యక్తమైంది. అంతకు ముందు హైకోర్టులో ప్రభుత్వానికి మొట్టికాయలు పడటం తో సీన్ మరింత వేడెక్కింది. దీంతో కేసీఆర్ కాస్త తగ్గినట్లే తగ్గారు. సమస్యలపై నర్మగర్భంగా మాట్లాడే కేసీఆర్ ఆ విధానాన్ని కాస్త తగ్గించుకున్నట్లే కనిపించింది. అయితే కృష్ణా జలాల విషయంలో మళ్లీ కేసీఆర్ కేంద్రంపై నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం-కేంద్రం కలిసి తెలంగాణకి ద్రోహం చేస్తుందంటూ కొత్త వాదనని తెరపైకి తీసుకొచ్చారు.
తెలంగాణ ప్రజల్ని తనవైపుకు తిప్పుకునే ఓ చిన్న ప్రయత్నం చేసారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అద్యక్షడు జేపీ నడ్డా మరోసారి రంగంలోకి దిగారు. కేసీఆర్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అవినీతిని ఎండగట్టే ప్రయత్నం చేసారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భారీగా అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించారు. 45 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్ట్ కి 85 వేల కోట్లు ఖర్చు చేసారని అరోపించారు. అవినీతిలో ముందున్న ప్రభుత్వం అభివృద్ధిలో శూన్యంలో ఉందని ఎద్దేవా చేసారు. లక్ష ఉద్యోగాలిస్తానన్న కేసీఆర్ నిరుద్యోగులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. ఏడు లక్షల ఇళ్లు అని చెప్పి 50 వేల ఇళ్లు కూడా కట్టలేదని మండిపడ్డారు.
రాష్ర్టంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతున్నా..కేసీఆర్ కుంభకర్ణుడిలా నిద్రపోతున్నారని ఎద్దేవా చేసారు. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ ని అమలు చేయకపోవడం వల్ల 98 లక్షల మంది బీమా సౌకర్యాన్ని కోల్పోయారన్నారు. అవును ఇది పాయింటే. తెలంగాణలో కరోనాని ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకురావాలని ప్రజలు సహా కాంగ్రెస్, బీజేపీలు ఎంత మొత్తుకున్నా కేసీఆర్ కనీసం పట్టించుకున్న పాపన కూడా పోలేదు. రాష్ర్టంలో కొవిడ్ వైద్యానికి కార్పోరేట్ ఆసుపత్రులు లక్షల రూపాయల్ని ఫీజులుగా దోచేస్తున్నాయి. పైకి వైద్యం ఉచితమని సర్కార్ చెబుతున్నా తీరా ఆసుపత్రికి వెళ్లే సరికి వేరే సీన్ కనిపిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. కాబట్టి ఇలాంటి అంశాలు అన్నింటిని బీజేపీ రాజకీయంగా వాడుకునే అవకాశం లేకపోలేదు.