2019 ఎన్నికల్లో ఘోర ఓటమిని చవి చూసిన టీడీపీ రాష్ట్రంలో రోజురోజుకు అంతరించిపోతుంది. ఓటమి నుండి కొలువడానికి చంద్రబాబు నాయుడుకి చాలాకాలం పట్టింది. ఆయన ఓటమిని అంగీకరించిన తరువాత టీడీపీ నేతలు పార్టీ నుండి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్నారు. అధికారంలో ఉన్న వైసీపీ నేతలు పెడుతున్న ఇబ్బందుల నుండి తప్పించుకోవడానికి టీడీపీ నేతలు మార్గాలు వెతుకుతున్నారు. అలా వెతుకుతున్న వారికి బీజేపీ నిలయంగా మారుతుంది.
రాష్ట్రంలో ఉన్న వైసీపీని అదుపు చేసే సత్తా కేవలం బీజేపీకే ఉందని భావిస్తున్న టీడీపీ నేతలు ఆ పార్టీలో చేరడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రధాన పోటీదారుడిగా మారడానికి బీజేపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గాల వారిగా సీనియర్ నేతలను బీజేపీ ఆహ్వానిస్తోంది.
ప్రస్తుతం ఏపీ లో నెలకొన్న పరిస్థితుల్లో బీజేపీలో చేరితేనే అన్ని రకాలుగా ఉపయోగం ఉంటుంది అధికార పార్టీ వేధింపులు, కేసుల నుంచితప్పించుకునేందుకు అవకాశం ఉంటుందనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీ వైపు చూస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో పాటు, కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా తెలుస్తోంది. బీజేపీలో చేరబోతున్న నాయకులుగా, మాజీ పురపాలక శాఖ మంత్రి పొంగులేటి నారాయణ అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, విశాఖ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇలా కొంతమంది పేర్లు తెరపైకి వస్తున్నాయి.టీడీపీ నుంచి బీజేపీలో చేరే నాయకుల లిస్టు పెద్దగానే ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరిని విడతల వారీగా పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తుంది.
టీడీపీపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని బీజేపీ నేతలు బాగా వాడుకుంటున్నారు. అలాగే వైసీపీ టీడీపీ నాయకుల పట్ల వ్యవహరిస్తున్న శైలి కూడా బీజేపీకి కలిసొస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటుంది. ఆంధ్రాలో ఇప్పటికే జనసేనతో కలిసిన బీజేపీ ఇప్పుడు టీడీపీ నేతలను కూడా చేర్చుకుంటు టీడీపీని రాష్ట్రంలో భూస్థాపితం చేయడానికి సన్నాహాలు చేస్తుంది. టీడీపీపై బీజేపీ ఇంత చేస్తున్నా కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం సైలెంట్ గా ఉన్నారు. బీజేపీ చేస్తున్న రాజకీయాలు రానున్న రోజుల్లో వైసీపీకి కూడా సోకనున్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.