ఏపీ బీజేపీలో మొదటి నుంచి సరైన నాయకత్వం అన్నది లేదు. నడిపించే బలమైన నాయకుడు ఏపీలో ఆపార్టీకి ఎప్పుడూ కొదవే. ఇప్పుడిప్పుడే ఆ పార్టీ ట్రాక్ లోకి వస్తోంది. కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి అదిష్టానం ఏపీలో పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణని తప్పించి మళ్లీ అదే సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజుని నూతన సారథిగా ఎంపిక చేసారు. మిత్రపక్షం జనసేన అధినేతతో కలిసి బీజేపీ ఇక చురుకగా తమ యాక్టివిటీస్ ని కొనసాగించడానికి రెడీ అవుతోంది. అయితే ఆ పార్టీ నేతల్లోనే ఒకరంటే ఒకరికి గిట్టని పరిస్థితులు ఉన్నాయి.
ఒకరు ఎడ్డెం..ఇంకొకరు తెడ్డం అనే వ్యవహార శైలిని తరుచూ చూస్తున్నదే. రాజధాని విషయంలో ఒక వర్గం అమరావతి కావాలంటే ..ఇంకొక వర్గం మూడు రాజధానులను సమర్ధించింది. ఇంకా పలు అంశాల్లో ఆ పార్టీలోనే అసమ్మతి సెగలు రగులుతోన్న మాట వాస్తవం. టీడీపీ నుంచి భాజాపాలోకి జంప్ అయిన నేతలంతా ఒక వర్గంగా కలిసి ఏర్పడ్డారు. ఆ నేతల శైలి విభిన్నంగా ఉంటుంది. బీజేపీలో ఉంటూ టీడీపీకి పరోక్షంగా మద్దతి శైలిని చూపించే ఓ వర్గం ఉంది. అలాగే అధికార పక్షానికి కొమ్ము కాసే నాయకులు బీజేపీలో ఉన్నారు. ఇటీవలే సోము వీర్రాజు రాత్రికే రాత్రే నూతన సారథిగా ఎంపిక కావడం..బాధ్యతలు తీసుకోకుండానే మీడియాలో వీర్రాజు హడావుడి చూసి కొంత మంది నేతలు హర్ట్ అయ్యారు.
ఆ తర్వాత చిరంజీవిని వ్యక్తిగతంగా వీర్రాజు కలవడం వంటి సన్నివేశాలు కొందరికి నచ్చలేదు. ముఖ్యంగా టీడీపీ నుంచి జంప్ అయిన నేతలు పార్టీలో తమ బలం తగ్గిపోతుందని భావించి గ్రూప్ రాజకీయాలకు తెర తీస్తున్నట్లు తాజా కథనాలు అంతకంతకు వేడెక్కిస్తున్నాయి. వాళ్ల ఆవేదన లో అర్ధం కూడా ఉంది. చిరంజీవి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా మాత్రమే ఉన్నారు. ఆయన రాజకీయాలను పూర్తిగా తప్పుకున్నట్లు ఎక్కడా ప్రకటించలేదు. కాబట్టి చిరు-వీర్రాజు కలయికని మర్యాద పూర్వక భేటీ అనడానికి లేదు. ఇది కచ్చితంగా రాజకీయ భేటీ అని విశ్లేషకులు చెప్పడంతో ఓ వర్గంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అయినట్లు సమాచారం. ఈ కారణంగా బీజేపీలో కొత్త చీలిక ఏర్పడిందని దాన్ని నాల్గవ వర్గం అని అంటున్నారు.