తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలు ఒక ఎత్తు, కేవలం హైదరాబాద్ లోనే కురిసిన వర్షాలు మరోఎత్తు. నగరం మొత్తం దాదాపుగా మునిగిపోయింది. వేల మంది ప్రజలు కొన్ని రోజులు పాటు నీళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి, చుట్టూ నీళ్లున్నా ఒక చుక్క మంచి నీళ్లు తగలేని దుస్థితి రావటంతో నగర జనాభా నరకయాతన అనుభవించారు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం యొక్క చేతకానితనమే అనే అభిప్రాయానికి ప్రజలందరూ వచ్చారు.
దీనితో పరామర్శకు వెళ్లిన ప్రజాప్రతినిధులను చొక్కా పట్టుకొని ప్రజలు నిలదీసే సంఘటనలు అనేకం జరిగాయి. తాజాగా మంత్రి సబితా ఇంద్ర రెడ్డికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. వరదల్లో ఇబ్బంది పడిన ప్రజానీకాన్ని పరామర్శించి, పరిహారం ఇవ్వటానికి వెళ్లిన సబితను స్థానిక ప్రజలు అడ్డగించి, ప్రభుత్వం అందిస్తున్న నష్టపరిహారం కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలకు నేతలు చెప్పిన వాళ్ళకు మాత్రమే అందుతోందంటూ బాగా మండిపడ్డారు. దీనితో మంత్రి సబితా వాళ్ళకి సర్దిచెప్పబోయిన కానీ వినకుండా నిరసనలు తెలిపారు. దీనితో సబితా పరామర్శను మధ్యలో ఆపేసి, కనీసం పరిహారానికి సంబంధించిన చెక్కులు కూడా ఇవ్వకుండా వెనుతిరిగి వచ్చేశారు.
ఇది సబితా ఇంద్ర రెడ్డికి జరిగిన అవమానం కాదు. తెరాస ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కు జరిగిన అవమానమనే చెప్పాలి. ప్రభుత్వం సరిగ్గా ఆదుకోవటం లేదని భావించే ఆ వ్యతిరేకతను సబిత ఇంద్ర రెడ్డికి. చూపించారు. ప్రభుత్వం మీద ఆగ్రహం ఉంటే ప్రజా ప్రతినిధుల మీద చూపిస్తారు తప్ప, అసెంబ్లీ ముందు, సచివాలయం ముందు సామాన్య ప్రజానీకం నిరసన జ్వాలలు తెలపటం చాలా అరుదు. ఇలాంటి సంఘటనలు ప్రభుత్వానికి ఒక హెచ్చరిక లాంటివి, వాటిని స్వీకరించి తప్పులు చేసుకుంటే రాబోయే రోజులు బాగుంటాయి, ఆలా కాకుండా చేసిన తప్పులు మళ్ళీ మళ్ళీ చేస్తుంటే రాజకీయ నాయకుల భవిష్యత్తు ప్రజల యొక్క చూపుడు వేలుకే వుంటుందనే విషయం మర్చిపోకూడదు, అధికారంలో కుర్చోపెట్టిన ప్రజలే, అధఃపాతాళానికి కూడా తొక్కేస్తారు. ఆ సంగతి గుర్తుపెట్టుకొని కేసీఆర్ తప్పులు ఎక్కడ జరిగాయో తెలుసుకొని సరిచేసుకుంటే మంచిది, లేకపోతే ప్రజా ఆగ్రహానికి బలి కాక తప్పదు .