ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గేదే.. అభ్యర్థికి ఊహించని ట్విస్ట్.. !

 

ఎన్నికలు వస్తున్నాయంటే రాజకీయ నాయకులు పగటి వేషగాళ్లలా మారిపోతారు.. రకరకాల వేషాలు వేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.. చివరికి తమ స్దాయిని మరచి కూడా ప్రవర్తిస్తారు.. మొత్తానికి ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ఫిట్లను ప్రదర్శించడం అన్ని చోట్ల కనబడుతుంది.. ఇక ఎన్నికల ప్రచారంలో తాము చేసిన నీతి మాలిన పనుల కోసం చెప్పుకోరు.. కానీ ప్రతిపక్ష నాయకుడు, అతని అనుచరులు చేసిన అవినీతిని మాత్రం బట్టబయలు చేస్తారు.. అక్కడికి వారేదో గాంధీ గారి శిష్యులు అయినట్లుగా ప్రవర్తించడం చూసే వారికి విడ్డూరంగా ఉంటుంది..

ఇకపోతే బీహార్ ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఓ అభ్యర్థి విన్నూతంగా ప్రయత్నించాడు.. ఇందులో భాగంగా గేదెను ఎంచుకోగా అదే ఇప్పుడు ఆయన కొంపముంచింది.. ఆ వివరాలు ఏంటో పరిశీలిస్తే.. బీహార్‌ లో జరగున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రీయ ఉలేమా కౌన్సిల్ పార్టీ అభ్యర్థి మహ్మద్ పర్వేజ్ మన్సూరి (45) గయ నియోజకవర్గంలో గేదెపై కూర్చొని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారట. ఈ విషయాన్ని ఎవరో జంతు ప్రేమికులు పోలీసుల చెవిన వేయగా మన్సూరి గాంధీ మైదానం నుంచి స్వరాజ్‌పురి రోడ్డుకు చేరగానే పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేసి, జంతు సంరక్షణ చట్టం తో పాటు కరోనా నిబంధనల ఉల్లంఘన కింద ఐపీసీ సెక్షన్ 269, 270 ల ప్రకారం కేసు నమోదు చేశారట..

అనంతరం మన్సూరిని బెయిల్‌పై విడుదల చేశారు. కాగా జంతువులను ప్రచారం కోసం వినియోగించ వద్దని ఈసీ ముందుగానే సూచించింది. కానీ ఈ నాయకులు వింటారా అలాంటివి వింటే మంచి నాయకులుగా మారారని ప్రజలు దూరం కొడతారనే భయమట.. ఇక తాను చేసిన పనిని సమర్ధించుకుంటున్న ఈ అభ్యర్ధి గయ పరమ చెత్త నగరమని, ఆ విషయాన్ని రాజకీయ నాయకులకు తెలిపేందుకే తాను అలా చేసినట్లు తెలిపారు. ఇక్కడ ఇదివరకు పదవులను అనుభవించిన వారు ఈ నగరాన్ని అభివృద్ధి చేయలేకపోయారని విమర్శిస్తూ, తనను గనక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే గయను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు..