Narendra Modi: ఏడాది కాలంలో భారతదేశం కరోనా పాండమిక్ నుంచి ఏమీ నేర్చుకోలేకపోయింది. అందుకే, సెకెండ్ వేవ్ సమయంలో తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాం. ఈ విషయాన్ని ఏ అమెరికానో, మరో దేశమో చెప్పాల్సిన పనిలేదు. అనుభవిస్తున్నది మనమే గనుక.. ఆ కష్టం మనకే తెలుసు. యుద్ధ విమానాల్లో విదేశాల నుంచి ఆక్సిజన్ తెచ్చుకుంటున్నాం.. యుద్ధ నౌకల్ని కూడా ఇందు కోసం వినియోగిస్తున్నాం. ఇది చాలు, దేశం.. కరోనా వైరస్ అనే మహమ్మారితో యుద్ధం చేస్తోందని చెప్పడానికి.
ఓ సారి కరోనా వైరస్, దేశాన్ని పలకరించి వెళ్ళాక.. రెండో సారి వచ్చే అవకాశం వుందని తెలిసినప్పుడు, కేంద్ర ప్రభుత్వం ఎంత అప్రమత్తంగా వుండాలి.? కానీ, దేశాన్ని గాలికొదిలేసింది నరేంద్రమోడీ ప్రభుత్వం. లాక్ డౌన్ వల్ల చాలా ప్రయోజనం.. అని గతంలో చెప్పిన మోడీ సర్కార్, ఇప్పుడు లాక్ డౌన్ చివరి అస్త్రమంటోంది. దేశంలో మెజార్టీ రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించేసుకున్నాయి. అదే కేంద్రం లాక్ డౌన్ ప్రకటిస్తే ఆ లెక్క వేరు. దేశ ప్రజలకు లాక్ డౌన్ వల్ల ఇబ్బందులే. అందులో ఇంకో మాటకు తావు లేదు. కానీ, ఇప్పుడు జరుగుతున్నదేంటి.? ఇదీ నష్టమే, కష్టమే. ప్రజల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు పబ్లసిటీ స్టంట్లు చేస్తున్నాయి.
వ్యాక్సిన్లు వెయ్యడం మానేసి, ఉచిత బియ్యం పథకాల్ని తెరపైకి తెస్తున్నాయి. నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టుగానే ప్రభుత్వాల వైఖరి వుంది. పబ్లసిటీ కోసం వేల కోట్లు ఖర్చు చేస్తూ, ప్రాణ వాయువు అందించే కేంద్రాలు నెలకొల్పడానికి వందల కోట్లు మాత్రమే సరిపోతాయంటున్నారు. ఏది నిజమో, ఏది పబ్లిసిటీనో అర్థం కాని పరిస్థితి. మూడో వేవ్ కూడా రాబోతోందట.
కానీ, దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్త నడకన సాగుతోంది. మొదటి వేవ్ సందర్భంగా రోజుకి లక్ష కేసుల లోపే నమోదయ్యాయి. ఇప్పుడు రెండో వేవ్ సందర్భంగా నాలుగు లక్షల కేసులు నమోదవుతున్నాయి రోజువారీగా. వీటి సంఖ్య 10 లక్షలకు అతి త్వరలోనే చేరుతుందనే వాదనలున్నాయి. మూడో వేవ్ అంటే, రోజుకి 20 లక్షలా.? కోటి కేసులా.? అన్న భయాందోళనలు కలగకుండా ఎలా వుంటాయ్.? ఇండియా తగలబడిపోతోంది కరోనా వైరస్ కారణంగా.. పాలకులు మాత్రం ఫిడేల్ వాయిస్తున్నారు.