సీనియర్ నటి ప్రియ, కెరీర్ పరంగా ఎన్నో ఎత్తుపల్లాల్ని చూసి వుంటారు. వ్యక్తిగత జీవితంలో కూడా చాలా ఆటుపోట్లను ఆమె చూసి వుండాలి. సమాజం పోకడల్ని అర్థం చేసుకోలేనంత అమాయకత్వం ఆమెకు వుంటుందని ఎవరూ అనుకోరు. మరి, ఆమె ఎందుకు బిగ్ హౌస్‌లో ఇద్దరు కంటెస్టెంట్లు అర్థరాత్రి వేళ, రెస్ట్ రూమ్‌లో హగ్ చేసుకుంటే దాన్ని హైలైట్ చేసి, హంగామా చేసినట్టు? రవి – లహరి మధ్య హగ్గు వ్యవహారం, ప్రియ ఎలివేట్ చేసిన తీరుతో అత్యంత జుగుప్సాకరంగా మారిపోయింది. ‘లహరీ.. నువ్వు మేల్ కంటెస్టెంట్లతోనే ఎక్కువగా తిరుగుతున్నావ్.. ఫిమేల్ కంటెస్టెంట్లకు అస్సలు అందుబాటులో వుండడంలేదు..’ అంటూ ప్రియ, లహరి మీద పెద్ద అబాంఢమే మోపేసింది. ఇందుకే కదా, బిగ్ బాస్ రియాల్టీ షోని బూతు కార్యక్రమంగా కొందరు అభివర్ణిస్తుంటారు.
ఈ రోజుల్లో స్త్రీ, పురుషులు.. పరాయి వ్యక్తులైనా కౌగలించుకోవడం అనేది సాధారణ వ్యవహారమే. కార్పొరేట్ వర్క్ కల్చర్ కావొచ్చు, నైట్ పార్టీలు, ఫ్యామిలీ పార్టీల ట్రెండ్ కావొచ్చు.. కారణం ఏదైనా, దాన్ని తప్పు పట్టలేని పరిస్థితి. అంతెందుకు, ప్రియ కూడా చాలామంది మేల్ కంటెస్టెంట్లను బిగ్ హౌస్‌లో పలు సందర్భాల్లో హగ్ చేసుకుంది. కానీ, ఆమెకు లహరి – రవిల మధ్య హగ్ అంత ప్రత్యేకంగా ఎందుకు కనిపించిందో ఏమో. నిజానికి, ప్రతిరోజూ టెలికాస్ట్ అయ్యే బిగ్ బాస్ ఎపిసోడ్లలో, చాలావరకు కౌగలింతలు కనిపిస్తాయి.. అసలు కౌగలింతలు లేని ఎపిసోడ్ బిగ్ బాస్ రియాల్టీ షో నుంచి ఊహించగలమా.? ప్రియ రేపిన హగ్గు రచ్చ కారణంగా నిన్నటి షో మరింత జుగుప్సాకరంగా తయారైంది. దాన్ని అంతలా సాగదీస్తూ షో నిర్వాహకులు ఎపిసోడ్‌ని సాగదీసిన తీరు కూడా అభ్యంతరకరమే. దీనితో బిగ్ బాస్ రియాల్టీ షో పాపులారిటీ పెరుగుతుందని నిర్వాహకులు భావిస్తే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.