సాధారణంగా తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతో అల్లారుముద్దుగా పెంచుతారు. ముఖ్యంగా పసి పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఏడాదిలోపు పిల్లలు నిద్రలో ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. కానీ తల్లిదండ్రులు మాత్రం వారిని సముదాయించి నిద్రపుచ్చటానికి ప్రయత్నిస్తారు. కానీ నెలన్నర వయసు ఉన్న పిల్లాడి ఏడుపు వల్ల నిద్రకి ఆటంకం కలిగిందని ఒక కసాయి తండ్రీ ఏకంగా చిన్నారి గొంతు కోసి హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన హర్యానాలోని ఫరీదాబాద్‌లో జరిగింది. ఈ ఘటనతో ఫరీదాబాద్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.
వివరాలలోకి వెళితే… సుందర్ అనే వ్యక్తి ఫరీదాబాద్‌లో తన భార్యా పిల్లలతో కలసి నివాసం ఉంటూ స్థానికంగా ఉన్న ఓ కంపెనీలో కూలీగా పనిచేస్తున్నాడు. సుందర్ కి ప్రియ అనే మహిళతో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. ప్రియ నెలన్నర క్రితమే కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇద్దరూ మగ పిల్లలే పుట్టారు. అయితే రక్షా బంధన్ రోజున ప్రియ ఇద్దరు పిల్లలలో ఒకరిని తనతోపాటు తీసుకొని పుట్టింటికి వెళ్ళింది. ఇక రెండవ కుమారుడు నవీన్ ని సుందర్ వద్ద వదిలి వెళ్ళింది. శుక్రవారం రోజు రాత్రి సుందర్ నిద్రపోతుండగా నెలన్నర వయసున్న నవీస్ పదేపదే ఏడవడం ప్రారంభించాడు. ఈ క్రమంలో సుందర్ రెండు మూడు సార్లు నవీస్‌ను జోకొట్టి నిద్రపుచ్చాడు.
అయితే చిన్నారి నవీన్ ఏడుపు ఆపకపోవడంతో సుందర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. చిన్నారి ఏడుపు వల్ల తన నిద్రకు ఆటంకం కలిగిందని తీవ్ర కోపంతో చిన్నారి గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత ఇంటి నుంచి పారిపోయారు. శనివారం రోజు మధ్యాహ్నం ప్రియ ఇంటికి తిరిగి వచ్చి చూడగా నవీస్ రక్తపు మడుగులో శవమై కనిపించాడు. దీంతో ప్రియా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తర్వాత ప్రియ వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న సుందర్ కోసం పోలిసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు.