ఏపీ మంత్రుల బస్సు యాత్రకి ఇంతటి పరాభవమా.?

సామాజిక న్యాయ భేరి.. అంటూ వైసీపీ మంత్రులు శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు చేపట్టిన బస్సు యాత్రకు తొలి రోజు నుంచే ఒకింత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతూ వస్తున్నాయి. ఒక్క నర్సరావుపేట బహిరంగ సభ మినహాయిస్తే, మొత్తంగా అన్ని చోట్లా జనం మంత్రుల బస్సు యాత్రను పూర్తిస్థాయిలో తిరస్కరించినట్లే కనిపిస్తోంది.

సాధారణ ప్రజానీకం ఎటూ మంత్రుల బహిరంగ సభకు రాలేదు. డబ్బులిచ్చి తీసుకొచ్చిన జనం కూడా మంత్రులు వచ్చేదాకా ఆయా బహిరంగ సభల్లో వుండకపోవడం వైసీపీ వర్గాల్ని ఆందోళనకు గురిచేసింది. తాజాగా, ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలు చోట్ల మంత్రులకు ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి.

రోడ్లను బ్లాక్ చేసి మరీ, అధికార పార్టీ కోసం ప్రత్యేక అనుమతుల్ని అధికారులు మంజూరు చేశారేమోగానీ.. వందలాది కుర్చీలను రోడ్ల మీద పరిచేశారు. చిత్రమేంటంటే దాదాపుగా అన్ని కుర్చీలూ ఖాళీగా కనిపించాయి. స్టేజీ మీద కనిపించిన వైసీపీ నేతల కంటే తక్కువగా స్టేజి కింద వైసీపీ కార్యకర్తలు వుండడం అందర్నీ విస్మయానికి గురిచేసింది.

‘డబ్బులిచ్చి తీసుకొచ్చాం కదా.?’ అంటూ పలువురు వైసీపీ నేతలు, కింది స్థాయి నేతల వద్ద అసహనం వ్యక్తం చేశారట. ఏర్పాట్లను చూసుకున్న నేతలపై మంత్రులూ అసహనం వెల్లగక్కారట. ‘ఖర్చు దండగ వ్యవహారం..’ అంటూ వైసీపీ నేతలే స్థానికంగా మాట్లాడుకోవడం కనిపించింది.

ఇదంతా వైసీపీ పట్ల తిరస్కరణ.. అని అనలేంగానీ, ముమ్మాటికీ.. వ్యూహాత్మక వైఫల్యమని మాత్రం చెప్పాల్సిందే.