తెలుగుదేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఒకవైపు నుండి మంచి చేస్తుంటే రెండోవైపు నుండి నష్టం చేకూరుస్తున్నాయి. ఓటమి అనంతరం చంద్రబాబు నాయుడు పార్టీ కోసం తీసుకున్న అతిపెద్ద నిర్ణయం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చడం. ఇన్నాళ్లు అధ్యక్షడిగా కొనసాగిన కిమిడి కళా వెంకటరావును తొలగించి ఆ స్థానంలో అచ్చెన్నాయుడును నియమించాలని అనుకుంటున్నారు. రేపో.. మాపో అధికారిక ప్రకటన వెలువడుతుంది. ఒకరకంగా చెప్పాలంటే నిస్తేజంగా ఉన్న పార్టీలో తిరిగి ఉత్సాహం నింపడానికి ఈ మార్పు బాగా ఉపకరిస్తుంది. అయితే ఈ ప్రయోజనం వెనకే ఇంకో నష్టం పొంచి ఉంది.
అదే ఒక ప్రధాన సామాజిక వర్గం నుండి వ్యతిరేకత. మొదటి నుండి శ్రేకాకుళం రాజకీయాల్లో కిమిడి కళా వెంకటరావు, కింజరాపు ఎర్రన్నాయుడు కుటుంబాల నడుమ పోటీ నడుస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు ఎర్రన్నాయుడు, వెంకటరావు ఆధిపత్యం కోసం ఢీ అంటూనే ఉండేవారు. ఒకసారి ఎర్రన్నాయుడు పైచేయి సాధిస్తే ఇంకోసారి కళా వెంకటరావు ముందంజలో ఉండేవారు. చంద్రబాబు సైతం ఒక్కోసారి వీరి మధ్యన సయోధ్య కుదుర్చడానికి నానాతంటాలు పడేవారు. అలాంటి నేపథ్యంలోనే ఎర్రన్నాయుడు తన సోదరుడు అచ్చెన్నాయుడును రాజకీయాల్లోకి దింపారు. బాబు కూడా ఆయన్ను సాదరంగా ఆహ్వానించి 2009లో టికెట్ కూడ ఇచ్చారు.
ఈ పరిణామం కళా వెంకటరావుకు నచ్చలేదు. దీంతో ఆయన టీడీపీని వీడి ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లిపోయారు. స ఎన్నికల్లో అచ్చెన్నాయుడు గెలవకపోయినా కళా వెంకటరావు పార్టీలో లేకపోవడంతో నిలదొక్కుకోగలిగారు. ఆతర్వాత ప్రజారాజ్యంతో పొసగక వెంకటరావు మళ్ళీ టీడీపీలోకే వచ్చారు. బాబు సైతం వెనక్కు వచ్చిన వెంకటరావును చిన్నతనంగా చూడకుండా పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. ఇప్పుడు ఆ పదవి నుండే వెంకటరావును తొలగించారు. ఎవరి మూలంగా అయితే ఆనాడు వెంకటరావు పార్టీని వీడారో ఇప్పుడు అదే అచ్చెన్నాయుడును పార్టీ అధ్యక్షుడిని చేశారు. ఇది ఆయన్ను తీవ్ర మనస్థాపానికి గురిచేసిందట. ఆయనకే కాదు ఆయన అభిమానులకు, సామాజికవర్గానికి కూడ ఈ పరిణామం నచ్చట్లేదట. అందుకే ఆయన వైసీపీలోకి వెళ్లే అవకాశం ఉండనే ప్రచారం జరుగుతోంది. మరి వెంకటరావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.