Big lie: ఒకే కాన్పులో 10మంది శిశువులు జననం.. ‘ఓ పచ్చి అబద్ధం..’

Big lie:ప్రపంచవ్యాప్తంగా 15రోజుల క్రితం.. దక్షిణాఫ్రికాకు చెందిన మహిళ ఒకే కాన్పులో 10మంది శిశువులకు జన్మనిచ్చిందనే విషయం విపరీతంగా వార్తల్లో నిలిచింది. 37ఏళ్ల గొసియామె థమారా సిథోలే ఈ అరుదైన రికార్డు సృష్టించిందని ప్రపంచ మీడియా హోరెత్తించింది. అయితే.. జూన్ 7న జరిగిన ఈ డెలివరీపై ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది దక్షిణాఫ్రికా ప్రభుత్వం. ఇదంతా అబద్ధమని.. సిథోలే గర్భమే దాల్చలేదని భారీ ట్విస్టే ఇచ్చింది. ఆమెను పరీక్షించి వైద్యులు ఇచ్చిన నివేదికను అధికారులు పూర్తిగా పరిశీలించిన తర్వాతే మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. దీంతో ఇదే ప్రపంచం ఇప్పుడు నివ్వెరపోతోంది.

మేలో మొరాకోలో హాలిమా సిస్సే అనే మహిళ 9మంది పిల్లలకు జన్మనిచ్చిన రికార్డును సిథోలే 10మంది పిల్లలకు జన్మనిచ్చి రికార్డు బ్రేక్ చేసిందని అందరూ నమ్మారు. ఏడుగురు మగ పిల్లలు, ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది నిజమేనని లోకల్ మేయర్ కన్ఫర్మ్ చేయడంతో నిజమని నమ్మి ప్రిటోరియా న్యూస్ ఎడిటర్ ఈవార్తను ప్రచురించారు. ఆమె భర్త తెబోగో సోతెత్సీ కూడా ఇదే చెప్పారు. స్కానింగ్ లో మొదట 6, తర్వాత 8.. కాన్పు సమయంలో ఏకంగా 10మంది జన్మించారని తెలిపాడు. అయితే.. దీనిపై దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఎంక్వైరీ చేసింది. స్థానికంగా అన్ని ఆసుపత్రుల్లో ఎంక్వైరీ చేస్తే ఎక్కడా 10మంది పిల్లలు పుట్టినట్టు ఆధారాలు లభించలేదు. దీంతో పిల్లలను చూపాలని ఒత్తిడితో సిథోలే పారిపోయి జోహన్స్ బర్గ్ లోని బంధువుల ఇంట్లో దాక్కుంది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

సామాజిక కార్యకర్తల సాయంతో తెంబ్సియా ఆస్పత్రి సైకియాట్రిక్ విభాగంలో ఆమెను చేర్చి మానసిక స్థితిపై చికిత్స అందిస్తున్నారు. విచారణలో ఆమె చెప్పిందేంటంటే.. అధిక సంతానాన్ని సాకుగా చూపి విరాళాలు సేకరించాలనేది భ‌ర్త ఆలోచనట. ఇప్పటికే విరాళాలు కూడా విరివిగా వచ్చాయి కూడా. దీంతో పోలీసులు షాక్ తిన్నారు. ఇప్పుడీ వార్త మరింత వైరల్ అయింది. ఒక్క అబద్ధంతో ప్రపంచాన్ని నమ్మించిన విధానంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఆమెను మెంటల్‌ హెల్త్ యాక్ట్‌ కింద అదుపులోకి తీసుకున్నారు. ప్రిటోరియా న్యూస్ ఎడిటర్ అత్యుత్సాహమే ఈ వార్తకు కారణమని తేలింది. సిథోలే దంపతులకు ఆరేళ్ల ఇద్దరు చిన్నారులు మాత్రం ఉన్నారు. ప్రస్తుతం ఈ అంశంలో కోర్టులో ఉంది.