అణు స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు జరిపిన నేపథ్యంలో, ఇరాన్ తీవ్ర ఆగ్రహంతో స్పందించింది. ఈ దాడులను అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే చర్యలుగా అభివర్ణిస్తూ, అమెరికా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్ ప్రకటించింది. విదేశాంగ మంత్రి సయీద్ అబ్బాస్ అరఘ్చి ఓ సోషల్ మీడియా పోస్టులో ఈ విషయాన్ని వెల్లడించారు.
అరఘ్చి వ్యాఖ్యల ప్రకారం.. అమెరికా ఈ చర్యలతో ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని గౌరవించకపోవడమే కాకుండా, ఓ శాశ్వత సభ్యదేశంగా నేరపూరిత ప్రవర్తన తో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఉదయం జరిగిన ఈ దాడులు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేలా ఉన్నాయని, దీర్ఘకాలిక ప్రభావాలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.
తామెప్పటికీ తలవంచబోమని, తమ సార్వభౌమత్వాన్ని, ప్రజలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అమెరికా ఈ దాడికి తగిన మూల్యం చెల్లించక తప్పదని అరఘ్చి తెలిపారు. అంతేకాక టెల్‌అవీవ్‌పై భారీ ప్రతిదాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం అంటూ ఇజ్రాయెల్‌కు కూడా వార్నింగ్ ఇచ్చారు.
ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇప్పటికే రెండు దశల్లో ఇరాన్, ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులు చేసింది. ఈ దాడుల్లో ఉత్తర, మధ్య ఇజ్రాయెల్ ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటివరకు 86 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితులు త్వరలో సద్దుమణిగేలా కనిపించట్లేదు.