ఒక్క క్షణం… అంత ప్రతీది మారిపోవచ్చు. నేల క్రింద ఎక్కడో కదలిక మొదలైతే.. మనం నిలబడే భూమే ఊగిపోతుంది. భవనాలు నేలమట్టం అయితే.. నగరాలు కూలిపోతే.. ఈ దృశ్యాలు సినిమాల్లో కాదు నిజంగా ఎన్నోసారి జరిగాయి. ప్రపంచాన్ని వణికించిన కొన్ని ఘోర భూకంపాలు చోటుచేసుకున్నాయి. ఈ కథనంలో అలాంటి పెను విషాదం మిగిల్చిన భూ కంపాల గురించి తెలుసుకుందాం.
1960లో చిలీలోని బయోబియో ప్రాంతంలో సంభవించిన భూకంపం ఇంత వరకూ నమోదైనవాటిలో అతి తీవ్రమైనది. దీని తీవ్రత 9.5. ఇది వాల్డివియా భూకంపంగా నమోదు అయ్యింది. ఈ ఘటనలో 1,655 మంది ప్రాణాలు కోల్పోయారు, సుమారు 20 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఇక 1964లో అలాస్కాలో 9.2 తీవ్రతతో సంభవించిన గుడ్ ఫ్రైడే భూకంపం రెండో స్థానంలో నిలిచింది. దీని ప్రభావంతో 130 మంది మరణించారు, భారీ ఆర్థిక నష్టాలు జరిగాయి.
2004లో ఇండోనేషియాలోని సుమత్రా తీరాన్ని 9.1 తీవ్రతతో సంభవించిన భూకంపం వణికించింది. దీని వల్ల వచ్చిన సునామీ దక్షిణాసియా దేశాలపై విపరీతంగా ప్రభావం చూపింది. దీని కారణంగా మొత్తం 2.8 లక్షల మందికిపైగా మృతి చెందారు. లక్షల మందికి నివాసం లేకుండా పోయింది. 2011లో జపాన్‌లో జరిగిన తోహోకు భూకంపం (9.1 తీవ్రత) కూడా అంతే స్థాయిలో ధ్వంసం మిగిల్చింది. ఇందులో 15,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఫుకుషిమాలో అణుశక్తి కేంద్రం ప్రమాదానికి గురికావడం, దీనికి మరింత భయానక రూపం ఇచ్చింది.1952లో రష్యాలో కమ్చట్కా తీరంలో సంభవించిన 9.0 తీవ్రత గల భూకంపం హవాయికి సునామీని తెచ్చింది. ఆర్థికంగా కూడా ఇది పెద్ద నష్టాన్ని మిగిల్చింది.
2010లో చిలీలో మరోసారి 8.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. 500 మందికిపైగా మృతి చెందారు. లక్షల ఇళ్లు కూలిపోయాయి. 1906లో ఈక్వెడార్-కొలంబియా తీరంలో సంభవించిన భూకంపం కారణంగా వచ్చిన సునామీ, దూరంగా ఉన్న శాన్ ఫ్రాన్సిస్కోను కూడా తాకింది. మన భారతదేశంలో 1950లో అస్సాం-టిబెట్ ప్రాంతాన్ని 8.6 తీవ్రతతో భూకంపం వణికించింది. దీనివల్ల 780 మంది మరణించారు. పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. నేలల్లో పగుళ్లు పడ్డాయి. 2012లో సుమత్రాలో మరోసారి సంభవించిన భూకంపం (8.6 తీవ్రత) తీవ్రమైన ప్రకంపనలను సృష్టించింది.
అయితే అసలు భూకంపాలు ఎందుకు వస్తాయంటే… భూమి ఉపరితలం “టెక్టానిక్ ప్లేట్‌లు” అనే పెద్ద ఆకృతులుగా విభజించబడి ఉంటుంది. ఇవి ఎప్పటికప్పుడు కదులుతుంటాయి. ఒకదానికొకటి తాకే చోటా, ఒకటి మరొకదాన్ని గుద్ది నొక్కే చోటా లేదా విరిగే చోటా, శక్తి ఒక్కసారిగా విడుదలవుతుంది. ఈ శక్తి భూమి ఉపరితలానికి ప్రకంపనల రూపంలో వస్తుంది. దీనినే భూకంపం అంటారు. శక్తి ప్రారంభమయ్యే బిందువును ఫోకస్ అంటారు. అది భూమి మీదకు వచ్చిన దిశను ఎపిసెంటర్ అంటారు.
వల్కానిక్ విస్ఫోటనాలు, భూగర్భంలో జరిగే ప్రళయాత్మక మార్పులు, మానవకృత చర్యలు కూడా కొన్ని సార్లు భూకంపాలకు కారణమవుతాయి. కానీ ఎంత ఆధునిక టెక్నాలజీ వచ్చినా… భూకంపాలు ఎప్పుడు వస్తాయో, ఎటువైపుకు వస్తాయో 100% చెప్పలేం. కాబట్టి, భూకంపాల గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు… అవి వచ్చినప్పుడు ఎలా సిద్ధంగా ఉండాలో, ముందస్తుగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాల్సిన అవసరం మరింత ఉంది.
