‘లవ్ స్టోరీ’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంచి టాక్ సంపాదించుకుంది. కష్టకాలంలో తెలుగు సినిమాకి ఊరటనిచ్చింది ‘లవ్ స్టోరీ’ రిలీజ్. వాస్తవానికి ‘సీటీమార్’ ద్వారా ఈ వేవ్ రావల్సి ఉంది. ‘సిటీమార్’ తరహాలో మాస్ సినిమా కాకపోయినా, నాగ చైతన్య, సాయి పల్లవి, శేఖర్ కమ్ముల ఈ ముగ్గురి బ్రాండ్ ‘లవ్ స్టోరీ’ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాయి. సినిమా ఎంత కమర్షియల్ విజయం సాధిస్తుంది.. అనే సంగతి పక్కన పెడితే, కొత్త సినిమా రిలీజ్ సందడి ఏంటో చూపించింది. పెద్ద సినిమాలు ధైర్యంగా ధియేటర్లలోకి వచ్చేందుకు మార్గం సుగమం అయ్యింది. నిజానికి ఈ స్థాయి ధైర్యాన్ని పెద్ద సినిమాలు చేసి ఉండాల్సింది. అయితే, పెద్ద సినిమాల కమర్షియల్ లెక్కలు వేరు. తేడా వస్తే, నిర్మాత డిస్ర్టిబ్యూటర్, ఎగ్జిక్యూటర్ అందరూ దెబ్బ తినేస్తారు. అందుకే, పెద్ద సినిమాలు కాస్త వెనుకడుగు వేశాయి. ఇప్పుడిక భయాలు తొలగిపోయాయి.
పెద్ద సినిమా వస్తే, ధియేటర్ల దగ్గర పండగ ఓ స్థాయిలో ఉంటుందని అర్ధమైపోయింది. ప్రతి వారం ఒకటో, రెండో పెద్ద సినిమాలొస్తే బాక్సాఫీస్ కళకల్లాడుతుంది. మూడో వేవ్ భయాలేమీ లేవిప్పుడు. ఆయా పెద్ద సినిమాల దర్శక, నిర్మాతలు, నటీ నటులు, డిస్ర్టిబ్యూటర్లు, ఎగ్జిక్యూటర్లు అంతా కలిసి ఓ నిర్ణయానికి వస్తే, జాతర షురూ అవుతుంది. సినీ పరిశ్రమ కష్టాల్ని గుర్తెరిగి ప్రభుత్వాలు అదనపు వెసులుబాట్లు కలిపిస్తే పరిశ్రమ వీలైనంత త్వరగా కోలుకుంటుంది. ఇదిలా ఉంటే, ఒకటీ అరా పెద్ద సినిమాలు మాత్రమే కొంత విడుదలకు సానుకూలంగా ఉన్నాయి. మిగతావన్నీ డిశంబర్ తర్వాతే ధియేటర్లలోకి రావచ్చు. సినిమా అంటేనే వ్యాపారం. పరిస్థితులు అనుకూలించకపోతే వ్యాపారం అంత తేలిక కాదు మరి. ‘లవ్ స్టోరీ’ తరహాలో ఇంకో రెండు, మూడు సినిమాలు, విడుదల రోజు సందడి చేస్తే, తెలుగు సినిమా పూర్వ వైభవాన్ని అందుకోవడానికి లైన్ క్లియర్ అవుతుందేమో.