టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని నిమ్మాడలో పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న అచ్చెన్నాయుడిపై కోటబొమ్మాలి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని బెదిరించినట్లు అచ్చెన్నాయుడిపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో అచ్చెన్నాయుడు ఇంటి వద్దకు భారీగా మోహరించిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని కోటబొమ్మాలి పోలీస్‌స్టేషన్ కు తరలించారు.
అచ్చెన్నను అరెస్ట్ చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబుఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ జగన్ రెడ్డి కక్ష సాధింపునకు పరాకాష్ట అన్నారు. ఉత్తరాంధ్రపై జగన్ రెడ్డి కక్ష కట్టారని.. అందుకే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలలో భయోత్పాతం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
దీంతో నిమ్మాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక మరోవైపు అప్పన్న ను పరామర్శించేందుకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కాసేపట్లో నిమ్మాడ కి రాబోతున్నారు. ఇదిలా ఉంటే , టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సొంత గ్రామం నిమ్మాడలో వారి కుటుంబ సభ్యులను కాదని ఎవరైనా సర్పంచ్‌గా పోటీచేస్తే వారిని చంపేస్తారా, ఇదేనా ప్రజాస్వామ్యం, అంటూ టెక్కలి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ ప్రశ్నించారు. జనవరి 31న కింజరాపు అప్పన్న నామినేషన్‌కు వెళితే ఆయన్ను, తనను చంపేందుకు కింజరాపు హరిప్రసాద్, సురేష్‌లతో పాటు 400 మంది మారణాయుధాలతో వెంటపడ్డారని శ్రీనివాస్ చెప్పారు. పోలీసులు, దేవుడి దయవల్ల బతికి బయటపడినట్టు తెలిపారు.