మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ వైసీపీ ప్రభుత్వ తీరుపై మరోసారి నిప్పులు చెరిగారు. అమరావతి ప్రాంత రైతులపై ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని మండిపడిన అఖిలప్రియ, రాజధానిగా అమరావతినే కొనసాగించాలని మూడు వందల రోజులుగా ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వంలో చలనం లేనట్లుగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రం కోసం, ప్రజల సంక్షేమం కోసం భూములిచ్చిన రైతులపై కక్షసాధింపులకు పాల్పడటం ఏమిటి? అని టీడీపీ నేత అఖిల ప్రియ ప్రశ్నించారు.
రాజధాని ప్రాంత రైతుల గోడును ఆ ప్రాంత ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోవడం లేదని, రైతులను పేయిడ్ ఆర్టిస్టులు అంటూ నానా దుర్భాషలాడుతున్నారని భూమా అఖిలప్రియ మండిపడ్డారు. రైతును రాజును చేస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం రైతులను రోడ్లపైకి వచ్చి అడుక్కునేలా చేస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపణలు చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఎందుకు నిరూపించలేక పోయింది అని ప్రశ్నించారు భూమా అఖిలప్రియ.
విశాఖను రాజధానిగా ప్రకటించాక అక్కడ 72వేల రిజిస్ట్రేషన్లు జరిగాయని అన్నారు. ఇప్పటికే అభివృద్ధి సాధించిన విశాఖపై పాలకులు ఎందుకు కన్నేశారో అందరికీ తెలుసు అని ఆమె పేర్కొన్నారు. కర్నూల్లో హైకోర్టు పెట్టడం అనేది ప్రభుత్వం చేతిలో లేదని మండిపడ్డారు. రాయలసీమకు హైకోర్ట్ వచ్చినంత మాత్రాన అక్కడి ప్రాంత యువతకు ఉద్యోగాలు వస్తాయా? అని నిలదీశారు.
ప్రజలు వారిలో వారే కొట్టుకొని చచ్చేలా చేస్తూ, వైసీపీ ప్రభుత్వం సంపాదనే ధ్యేయంగా పాలన సాగిస్తోంది అన్నారు. ఆఖరికి తమ స్వార్థం కోసం కులాలు, మతాల మధ్యన కూడా చిచ్చుపెట్టాలని చూస్తున్నారన్నారు. బ్రిటీషు వారి మాదిరే, వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో విభజించు- పాలించు విధానాన్ని అమలు చేస్తోంది అని అన్నారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం అభివృద్ధిలో పొరుగు రాష్ట్రాలతో పోటీ పడిందని అన్నారు. వైసీపీకి ఓటేసినవారంతా ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ అమరావతి రైతులకు అండగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు.