తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. వెయ్యి రూపాయలు ఫీజు చెల్లించి ఎల్ఆర్ఎస్ కు ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్ 15న చివరి తేదీ. ఆ తర్వాత ఎల్ఆర్ఎస్ కోసం ప్లాట్లను వెరిఫై చేసి ఎల్ఆర్ఎస్ ఆమోదిస్తారు.
అయితే.. ఎల్ఆర్ఎస్ పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కరోనా కాలంలో ఓవైపు ప్రజలు పనులులేక అల్లాడుతుంటే.. ప్రభుత్వానికి ఇప్పుడే సమయం దొరికిందా ఎల్ఆర్ఎస్ పేరుతో దోచుకోవడానికి. ప్రజలను పీక్కుతిని ప్రభుత్వం ఏం సాధిస్తుంది.. అంటూ విపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న సంగతి కూడా తెలిసిందే.
తాజాగా.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా ఇదే అంశంపై ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. పన్నుల పేరుతో రాష్ట్ర ప్రభుత్ ప్రజల రక్తాన్ని పీల్చే పనిలో ఉందని ఆయన దుయ్యబట్టారు.
ఎల్ఆర్ఎస్ కడితేనే రిజిస్ట్రేషన్లు చేస్తామని ప్రభుత్వం ప్రజలను బెదిరిస్తోందని ఆయన విమర్శించారు. పేదలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వమే ప్లాట్లను క్రమబద్దీకరించాల్సింది పోయి.. పేదల నుంచి ఫీజు పేరుతో వసూళ్లకు పాల్పడటం దేనికి నిదర్శనమన్నారు.
తెచ్చిన అప్పులను తీర్చడం కోసం ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతోందని భట్టి విమర్శించారు. సీఎంగా కేసీఆర్ శాశ్వతం కాదు.. మేం అధికారంలోకి వచ్చాక అందరికీ న్యాయం చేస్తాం. ఎవ్వరూ భయపడొద్దు.. అంటూ భట్టి ప్రజలకు హామీ ఇచ్చారు.