తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల మంటలు రాజుకుంది. గత రెండేళ్లుగా అసెంబ్లీ ముఖం చూడటానికి భయపడుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా అవసరమా అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రంగా ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా పినపాక గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన కేసీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ బీఆర్ఎస్ నేతల వైఖరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
పినపాకలో కొత్తగా నిర్మించనున్న 33/11 కిలోవోల్ట్ విద్యుత్ ఉపకేంద్రానికి భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. ప్రజలు తిరస్కరించినప్పటికీ మాజీ ముఖ్యమంత్రి ఇంకా మారలేదని ఎద్దేవా చేశారు. ప్రజాసభల్లోకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడే ధైర్యం లేకనే, మీడియా సమావేశాల వేదికగా ప్రభుత్వంపై ఇష్టారాజ్యంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీకి హాజరుకాని వ్యక్తి ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగడం ప్రజాస్వామ్యానికి తగదని స్పష్టం చేశారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతిపక్ష నేతలు అనవసరంగా విష ప్రచారం చేస్తున్నారని భట్టి విమర్శించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మాటలకన్నా పనికే ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ప్రజల కోసం ప్రతి రూపాయిని పారదర్శకంగా ఖర్చు చేస్తున్నామని, అభివృద్ధి కార్యక్రమాలే తమ సమాధానమని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం ప్రభుత్వం నిరంతరంగా చర్యలు తీసుకుంటోందని భట్టి విక్రమార్క తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వోల్టేజీ సమస్యలు, కరెంట్ కోతలు లేకుండా ఉండేందుకు కొత్త ఉపకేంద్రాలు కీలకంగా మారనున్నాయని అన్నారు. పినపాకలో ఏర్పాటు చేస్తున్న ఈ ఉపకేంద్రం పరిసర గ్రామాలకు విద్యుత్ భద్రతను కల్పిస్తుందని పేర్కొన్నారు.
వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం ఏటా సుమారు రూ.12,500 కోట్ల వరకు భారం మోయుతోందని భట్టి వెల్లడించారు. రైతుల సంక్షేమం కోసం విద్యుత్ రంగాన్ని బలోపేతం చేస్తూ మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం ప్రజల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తుందని మరోసారి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, మాలావత్ రాందాస్ నాయక్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భట్టి విక్రమార్క సింగరేణి ప్రాజెక్టులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పనితీరును చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని, ప్రజల మద్దతే తమ బలం అని భట్టి ధీమా వ్యక్తం చేశారు.
