‘భారతీ పే’ వర్సెస్ ‘బ్రాహ్మణి పే’.! ఇంతకీ ఎవరి పైత్యమిది.?

రాజకీయాలెప్పుడో భ్రష్ట్టుపట్టిపోయాయ్. కాకపోతే, దిగజారిపోయిన రాజకీయాలకు సంబంధించి కొత్త లోతుల్ని ప్రస్తుతం రాజకీయ పార్టీలు వెతుకుతున్నాయి. ఈ క్రమంలో సరికొత్త ఆవిష్కరణలు తెరలేపుతున్నాయి అత్యంత జుగుప్సాకరంగా. రాజకీయ పార్టీలు, వాటికి అనుబంధంగా పనిచేస్తోన్న కొందరు ‘దురభిమానులు’ ఈ పైత్యాలకు కారణం.

కర్నాటక ముఖ్యమంత్రి అవినీతికి వ్యతిరేకంగా ‘పే సీఎం’ అంటూ పోస్టర్లు వెలిశాయి బెంగళూరులో కొద్ది రోజుల క్రితం. అదే బాటలో, లిక్కర్ మాఫియా ఆరోపణలు చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి పేరు మీద ‘భారతి పే’ అంటూ పోస్టర్లను రూపొందించి వదిలారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద విమర్శలు సర్వసాధారణమయిపోయాయి. అందుకే, కొత్తగా ఆలోచించినట్లున్నారు. ఈ దిక్కుమాలిన సలహా ఎవరిదోగానీ, అత్యంత ఛండాలంగా తయారైంది వ్యవహారం. భారతి ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించలేదు. కానీ, ఆమె పేరుని బజారుకీడ్చారు. ఆమె ఫొటోలని పోస్టర్లలో వేసి, అత్యంత జుగుప్సాకరంగా కామెంట్లేస్తున్నారు.

వైసీపీ ఊరుకుంటుందా.? నారా బ్రాహ్మణి పేరుని రోడ్డు మీదకు లాగింది. ఈ పేరుని కూడా అత్యంత జుగుప్సాకరమైన రీతిలో పేర్కొంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టర్లను సర్క్యులేట్ చేస్తున్నారు. భారతి పోస్టర్లను టీడీపీ, బ్రాహ్మణి పోస్టర్లను వైసీపీ.. ప్రచారం చేస్తున్నాయి.

ఇంట్లో ఆడవాళ్ళను ఇలా నీఛ రాజకీయాల్లోకి లాగడం ఎంతవరకు సబబు.? అన్న కనీసపాటి ఇంగితం రెండు పార్టీలకూ లేకుండా పోతోంది. వీళ్ళు మళ్ళీ మహిళాబ్యుదయం గురించీ, మహిళల హక్కుల గురించీ, మహిళల రక్షణ గురించీ మాట్లాడుతుంటారు.