ముఖ్యమంత్రి కుర్చీలో భారతి.! హాస్యానికైనా హద్దుండాలి కదా.?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో జైలుకు వెళ్ళబోతున్నారట.! అలాగని, టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది. ఏమో, కక్ష సాధింపు రాజకీయాలు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో ఇలాంటివి జరగొచ్చేమో. గతంలో వైఎస్ జగన్ జైలుకు వెళ్ళారు, చాన్నాళ్ళు జైలులో వున్నారు.. ఆ తర్వాత బెయిల్ మీద విడుదలయ్యారు. ఏళ్ళ తరబడి ఆ కేసులు అలా అలా సాగుతూనే వున్నాయి.

మళ్ళీ ఇంకోసారి వైఎస్ జగన్ జైలుకు పోవడం ఖాయమని బలంగా నమ్ముతోంది తెలుగుదేశం పార్టీ. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళతారని జోస్యం చెప్పిన పార్టీల్లో బీజేపీ కూడా వుంది. జనసేన సంగతి సరే సరి. పైన చెప్పుకున్నట్టు, రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.

టీడీపీ అధినేత చంద్రబాబుని జైలుకు పంపుతామంటూ శపథం చేసేసింది వైసీపీ. పంపగలిగిందా.? లేదు కదా.! ఒకవేళ తాను జైలుకు వెళితే ఏంటి పరిస్థితి.? అంటూ చంద్రబాబు, తన భార్య భువనేశ్వరిని రాజకీయాల్లోకి తీసుకురాలేదు కదా.!

.వైఎస్ జగన్ మాత్రం, ఎందుకు తన బదులు తన భార్య భారతిని రాజకీయాల్లోకి తీసుకొస్తారు.? భారతిని రాజకీయాల్లోకి తెచ్చేందుకు వీలుగా వైఎస్ జగన్, తన తల్లి విజయమ్మని పార్టీ నుంచి బయటకు పంపేశారంటూ టీడీపీ విశ్లేషిస్తోంది. టీడీపీ అనుకూల మీడియా అదే ప్రచారం చేస్తోంది.

కుటుంబాల్ని రాజకీయాల్లోకి లాగడం ఎంతవరకు సబబు.? అన్న కనీస ఇంగితం లేనప్పుడే ఇలాంటి విశ్లేషణలు, చర్చలు తెరపైకొస్తాయ్.!