తెలుగు ప్రజల ఆరాధ్య దైవం.. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి.. స్వర్గీయ నందమూరి తారకరామారావుకి బారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఈనాటిది కాదు. అయితే, జయంతికో వర్ధంతికో మాత్రమే తెలుగుదేశం పార్టీ ఈ డిమాండుని తెరపైకి తెస్తుంటుంది. నిజానికి, స్వర్గీయ నందమూరి తారకరామారావు రాజకీయాల్లోనూ అందరివాడేనని అనిపించుకున్నారు. అయితే, రాజకీయ వెన్నుపోటు కారణంగా ఎన్టీయార్ రాజకీయ జీవితం అంతమైపోయింది.. అదే ఆయన్ని మానసికంగా కుంగిపోయేలా చేసిందనీ, చివరికి ఆయన మరణానికి కారణమయ్యిందనేది నిర్వివాదాంశం. స్వర్గీయ ఎన్టీయార్ జయంతి నేపథ్యంలో మరోమారు ఈ భారతరత్న అంశం తెరపైకొచ్చింది.
టీడీపీ నేతలే కాదు, సినీ నటుడిగా స్వర్గీయ ఎన్టీయార్ పైన అభిమానం వున్నవారు, అందునా మెగాస్టార్ చిరంజీవి లాంటి సెలబ్రిటీలూ స్వర్గీయ ఎన్టీయార్‌కి భారతరత్న ఇవ్వాలంటూ సోషల్ మీడియా వేదికగా తమ వాదనను గట్టిగా వినిపిస్తున్నారు. స్వర్గీయ ఎన్టీయార్, భారతరత్న పురస్కారానికి అర్హుడే. పురస్కారాలు అర్హులైనవారికి దక్కితే వాటి గౌరవం మరింత పెరుగుతుందన్నది అందరికీ తెలిసిన విషయమే. స్వర్గీయ ఎన్టీయార్ విషయంలో భారతరత్న ఎందుకు మొహం చాటేస్తోంది.? అంటే, దానికి చాలా కారణాలు చెబుతారు రాజకీయ విశ్లేషకులు. స్వర్గీయ ఎన్టీయార్ కుటుంబంలోని రాజకీయ విభేదాలే, ఆయనకు భారతరత్న రాకపోవడానికి కారణమన్నది మెజార్టీ అభిప్రాయం.
స్వర్గీయ ఎన్టీయార్, జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు. ప్రధాని అయ్యే అవకాశం కూడా ఆయనకు గతంలో వచ్చింది. అలాంటి వ్యక్తిని భారతరత్న వరించడమంటే పెద్ద కష్టమేమీ కాదు. ఎన్టీయార్ తర్వాత చంద్రబాబూ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఎన్టీయార్ కుమార్తె పురంధరీశ్వరి కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. ఎన్టీయార్ కుమారులు హరికృష్ణ, బాలకృష్ణ చట్ట సభలకు ప్రాతినిథ్యం వహించారు, వహిస్తున్నారు. అయినా, భారతరత్న విషయమై స్వర్గీయ ఎన్టీయార్ కుటుంబం ఒక్కతాటిపైకి ఏనాడూ వచ్చినట్లు కనిపించదు. అసలు చిత్తశుద్ధితో పనిచేసినట్లూ కనిపించలేదు. అదే అసలు సమస్య. ఇప్పటికిలా.. మళ్ళీ వర్ధంతికో, జయంతికో ఇంకోసారి భారతరత్న డిమాండ్ వినిపిస్తుంది.