Telangana TDP: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చాలా కాలంగా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిందనే కామెంట్స్ వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం పూర్తి స్థాయిలో టిడిపి కనుమరుగైంది. అయితే ఇప్పటికి తెలంగాణ మూలల్లో టీడీపీ శ్రేణులు ఉన్నారు. ఇక ఏపీలో గెలిచిన అనంతరం తెలంగాణలో మళ్ళీ పసుపు జెండాలు మెరిశాయి. పలువురు మాజీ నేతలు కూడా మీడియా ముందు ప్రెస్ మీట్స్ పెట్టె వరకు వచ్చారు. .
చంద్రబాబు కూడా బ్యాక్ గ్రౌండ్ లో నేతలతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నారు. ఇక పార్టీని పూర్తి స్థాయిలో పునర్నిర్మించే దిశగా చర్చలు జరుగుతున్నాయని ఏపీ మంత్రి నారా లోకేశ్ ఇటీవల తెలిపారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణను ప్రకటించి, పార్టీ కార్యక్రమాలను ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా తెలంగాణలో టీడీపీపై ఉన్న అభిమానం, ప్రజల విశ్వాసం గురించి లోకేశ్ తన అభిప్రాయాలను పంచుకున్నారు.
లోకేశ్ చెప్పిన వివరాల ప్రకారం, తెలంగాణలో 1.60 లక్షల మంది టీడీపీ సభ్యత్వం తీసుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. పార్టీకి ప్రస్తుతం ఎమ్మెల్యేలు లేకపోయినప్పటికీ, ఇటువంటి మద్దతు లభించడం అనేది ఎన్టీఆర్ కలల పార్టీపై ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనమని అభిప్రాయపడ్డారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు శక్తివంతమైన కార్యాచరణతో ముందుకు వెళ్తామని చెప్పారు.
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడిన లోకేశ్, ఎన్టీఆర్ తెలుగు ప్రజల గౌరవాన్ని ఎత్తిన ఘనత ఆయనదేనని స్పష్టం చేశారు. అప్పట్లో తెలుగువారిని ‘మదరాసీలు’ అని పిలిచే పరిస్థితి నుంచి బయటపడేలా, తెలుగువారమనే గర్వం కలిగించిన నాయకుడిగా ఎన్టీఆర్ చరిత్రలో నిలిచారని అన్నారు.
అలాగే ఎన్టీఆర్ ఆశయాలు ఇప్పుడు కూడా పార్టీకి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని, ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే ప్రజల గుండెల్లో చెరగని గుర్తుగా నిలిచాయని లోకేశ్ వివరించారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు భారతరత్న పురస్కారం రావాలని కోరుకుంటున్నామన్నారు. తమ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మరోసారి పునర్నిర్మాణం చెందుతుందని, వచ్చే రోజుల్లో తెలంగాణ ప్రజలకు మరింత సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని లోకేశ్ ధైర్యంగా తెలిపారు. పార్టీ కోసం కొత్త కార్యాచరణలు రూపకల్పన చేయడం ద్వారా పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని తెలిపారు.