బెజవాడ డ్రగ్స్ రగడ: టీడీపీ చిత్రమైన రాజకీయం

చీటికీ మాటికీ పెద్ద పెద్ద వివాదాలుగా చిన్న చిన్న విషయాల్ని మార్చడం రాజకీయ పార్టీలకి అలవాటే. సున్నితమైన విషయాల్లో సంయమనం పాఠించాల్సిన రాజకీయ పార్టీలు అక్కడ కూడా రాజకీయ లబ్ధిని చూస్తుంటాయి. అదే అసలు సమస్య. విజయవాడ కేంద్రంగా వందల కోట్ల, వేల కోట్ల డ్రగ్స్ రాకెట్ నడుస్తోందంటూ, రాజకీయ రచ్చ తెరపైకి వచ్చింది. అయితే, విజయవాడ చిరునామా పెట్టి ఓ వ్యక్తి, చెన్నై కేంద్రంగా ట్రేడింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఆ సంస్థ నుంచే పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఇంపోర్ట్ అయినట్లు విచారణలో తేలింది. ఆ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాకి చెందిన వాడు. విజయవాడలో అత్తగారింటిని తన కార్యకలాపాల కోసం ఆఫీసుగా మార్చాడు.

అయితే, అతను చెన్నైలో స్థిరపడ్డాడు. అక్కడి నుంచే అన్ని వ్యవహారాలు నడుపుతున్నాడు. ట్విస్ట్ ఏంటంటే, తనకసలు డ్రగ్స్‌తో సంబంధం లేదని స్వయానా ఆయన తల్లి చెబుతోంది. డ్రగ్స్ ఆయన కంపెనీ ద్వారానే దేశంలోకి ఇంపోర్ట్ అయినట్లుగా విచారణలో తేలింది. ఈ మొత్తం వ్యవహారాన్ని రాజకీయ వివాదంగా మార్చేసి, ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీకి అంటకడుతోంది టీడీపీ. అయితే, నింద పడ్డాకా నిజానిజాలు తేలే దిశగా జగన్ సర్కార్ చిత్తశుద్ధి ప్రదర్శించాలి. రాష్ర్టానికి సంబంధం లేదు..అని అధికార పార్టీ చెబితే, అది ఆత్మహత్య సదృశం అవుతుంది. పార్టీ ప్రతిష్ట, ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బ తినకుండా ఇంతటి సున్నితమైన అంశాన్ని అత్యంత జాగ్రత్తగా ప్రభుత్వ పెద్దలు, పార్టీ పెద్దలు ఎలా డీల్ చేస్తారో మరి.