వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణమరాజు-జగన్ సర్కార్ మధ్య వివాదం తుది అంకానికి చేరుకుంది. రఘురాం ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు, విమర్శలకు వేటు వేయాలని ప్రభుత్వం ఇప్పటికే లోక్ సభ ముందుకెళ్లింది. అలాగే రఘురాం తన వాదనని లోక్ సభ స్పీకర్ ముందు వినిపించారు. ఇక అనర్హత వేటు వేయాలా? లేదా? అన్నది కేంద్రం చేతుల్లోనే ఉంది. అయితే ఇప్పుడీ వివాదంపై పార్లమెంట్ నియోజక వర్గం సహా ఆ చుట్టు పక్కల గ్రామాల్లో వైకాపా పార్టీ రెండు వర్గాల మధ్య జోరుగా బెట్టింగ్ లు సాగుతున్నాయట. రఘురాం వాదనల్ని బలపరుస్తూ ఆయన వర్గం ఒకవైపు ఉంటే..ఆయన్ని వ్యతిరేకించి ప్రభుత్వ విధానాల్ని సమర్ధించే వర్గానికి మధ్య ఇప్పుడస్సలు పొసగడం లేదుట.
నరసాపురంలో ఇప్పటికే ఆ రెండు వర్గాల మధ్య ఎప్పటి నుంచో అంతర్గత పోరు నడుస్తోంది. తాజాగా రఘురాం వైకాపా నుంచి రెబల్ గా బయటకు వచ్చేయడంతో ఇప్పుడా వివాదం పీక్స్ కు చేరినట్లు స్థానిక నాయకుల నుంచి తెలిసింది. రఘురాం అనర్హత వేటుపై ఆ నియోజక వర్గంలో జోరుగా బెట్టింగ్ లు నడుస్తున్నాయని టాక్ వినిపిస్తోంది. అనర్హత వేటు పడుతుందని వైకాపా వర్గీయులు బలపరుస్తూ ప్రత్యర్ధి వర్గంతో బెట్టింగ్ లు వేస్తున్నారుట. నరసాపురం నడిబొడ్డునే ఈ బెట్టింగ్ ల తంతు జోరుగా సాగుతుందని తెరపైకి వచ్చింది. కొడిపందెలాకు నెలవైన నరసాపురం, భీమవరం నియోజక వర్గాల్లో ఆ కోడి పందాలు కన్నా..ఇప్పుడు రఘురాం పై బెట్టింగ్ పందాలే జోరుగా సాగుతున్నాయని వినిపిస్తోంది.
రఘురాం పార్టీపై వ్యతిరేక ఆరోపణలు చేసినప్పటి నుంచి అక్కడ ఆ రెండు వర్గాల మధ్య బెట్టింగ్ ల తంతు జోరుగా సాగుతుందిట. ఇందులోకి కూలాలకు రంగు కూడా పులిమారని చర్చకొచ్చింది. రఘురాం సామాజిక వర్గం టీడీపీ వర్గంతో కలిసి పనిచేస్తుం దని.. ఆ రెండు వర్గాలే కలిసి వ్యతిరేక వర్గమైన వైకాపా కు అనుకూలంగా వారితో బెట్టింగ్ లు షురూ చేసినట్లు మాట్లాడుకుంటున్నారు. రఘురాం సామాజిక వర్గమే అక్కడ పెద్ద పీఠ వేసేది కావడంతో ఆయన బలం ఎక్కువగానే ఉందని స్థానిక నేతల ద్వారా తెలిసింది.