గత ఎన్నికల్లో వైఎస్ జగన్ దాదాపు అన్ని జిల్లాల్లోనూ టీడీపీని చావు దెబ్బ కొట్టారు. ఏకంగా 151 ఎమ్మెల్యే స్థానాలతో విజయకేతనం ఎగురవేశారు. జగన్ ఈ స్థాయి మెజారిటీ సాధించడానికి కొన్ని జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడమే. అలాంటి జిల్లాల్లో నెల్లూరు జిల్లా ఒకటి. రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉండే నెల్లూరు గత ఎన్నికల్లో వైసీపీకి బ్రహ్మరథం పట్టింది. మొత్తం 10 ఎమ్మెల్యే స్థానాల్లో వైసీపీ అభ్యర్థులే గెలుపొందారు. ఎక్కడా తేడా లేకుండా పూర్తిగా వైసీపీ అభ్యర్థులంతా భారీ మెజారిటీతో గెలుపొందారు. అందుకే ఈ జిల్లా అంటే వైఎస్ జగన్ కు ప్రత్యేక అభిమానం. ఈ జిల్లా నుండి ఇద్దరు నేతలకు మంత్రి వర్గంలో చోటు కూడ కల్పించారు. మొదటి నుండి ఈ జిల్లాలో ఆధిపత్యం కోసం పోరాడుతూ వస్తున్న టీడీపీ గత ఎన్నికలతో చతికిలబడిపోయింది.
ఓడిన 10 మంది టీడీపీ అభ్యర్థులు బయట కనిపించడమే మానేశారు. దీంతో జిల్లా పూర్తిగా వైసీపీ నేతల వశమైపోయింది. ఎక్కడ చూసినా వారిదే హవా. టీడీపీ లీడర్లను ఆటాడుకుంటున్నారు. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో కూడ తెలుగుదేశం నేత ఒకరు ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఆయనే ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్. పార్టీ ఓడిన తర్వాత నేతలంతా చప్పబడిపోతే ఈయన మాత్రం దూకుడు పెంచారు. అధికార పార్టీ నేతలు ఎవరైనా సరే ఎదురెళ్ళిపోతున్నారు. మండలిలో వైసీపీ నేతలకు ఎలాగైతే గట్టి సమాధానం ఇస్తున్నారో బయట కూడ అదే రీతిలో పోరాడుతున్నారు.
ఈయన సోదరుడు బీద మస్తాన్ రావు కూడ ఒకప్పుడు టీడీపీలో బలమైన నేతగా ఉన్నారు. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి గత ఎన్నికల్లో టీడీపీ నుండి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయి ఇటీవలే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సోదరుడు వైసీపీలోకి వెళ్లడంతో రవిచంద్ర కూడ పార్టీ మారతారని అనుకున్నారు. కానీ రవిచంద్ర టీడీపీని వీడలేదు. జిల్లా భాద్యత మొత్తాన్ని భుజానికెత్తుకుని ముందుకు సాగుతున్నారు. అది ఇది అని తేడాలు లేకుండా అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీని బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తున్నారు. అనిల్ కుమార్ యాదవ్, కొటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి గౌతం రెడ్డి లాంటి వైసీపీ మహామహులు ఎంత ట్రై చేసినా రవిచంద్రను మాత్రం సైలెంట్ చేయలేకపోతున్నారు. అలా 10 మంది ఎమ్మెల్యే వైసీపీ కంచుకోటలో బీద రవిచంద్ర నిత్య యుద్దం చేస్తున్నారు.