యూఏఈలో ఐపీఎల్​ నిర్వహణకు బీసీసీఐకు ఎంత ఖర్చైందో తెలుసా?

కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్ కష్టమే అనుకున్నారు. అయితే పరిస్థితులు కాస్త కుదుటపడటంతో యూఈఏలో సురక్షితంగా, విజయవంతంగా టోర్నీ నిర్వహించింది బీసీసీఐ. ఇక ఐపీఎల్ ఎంత కాస్ట్లీ లీగో అందరకీ తెలిసిన విషయమే. మోస్ట్ సక్సెస్‌ఫుట్ కంట్రీ లీగ్‌గా ఐపీఎల్ దూసుకుపోతుంది. అయితే యూఏఈలో ఐపీఎల్ నిర్వహణ కోసం ఎమిరేట్స్​ క్రికెట్​ బోర్డుకు వంద కోట్ల రూపాయలకుపైనే భారత బోర్డు చెల్లించినట్లు తెలిసింది.


ఈ విషయాన్ని ఓ విశ్వసనీయ వార్తా సంస్థ ప్రచురించింది. మాములుగా లీగ్​ ఇండియాలో జరిగితే.. ఆయా రాష్ట్ర సంఘాలకు మ్యాచ్​కు కోటి రూపాయల చొప్పున బీసీసీఐ చెల్లిస్తుంది. ఈ ప్రాతిపదికన మొత్తం 60 మ్యాచ్​లకు 60 కోట్లు ఖర్చవుతుంది. అయితే ఈ మొత్తం చెల్లించేందుకు రూ.30 నుంచి 50 లక్షలను ఫీజు రూపంలో ఫ్రాంఛైజీల నుంచి తీసుకుంటుంది బీసీసీఐ. ఈ ఏడాది దుబాయ్​లో లీగ్​ జరగడం వల్ల మ్యాచ్​ నిర్వహణ ఖర్చులతో పాటు క్రీడాకారుల వసతులు, ఆహారం, ప్రయాణ ఖర్చుల భారం ఎక్కువయింది. దీంతో మొత్తం కలిపి రూ.104 కోట్లను ఎమిరేట్స్​ క్రికెట్​ బోర్డుకు చెల్లించింది బీసీసీఐ.

ఈ ఏడాది ఐపీఎల్​లో రోహిత్​ శర్మ సారథ్యంలోని ముంబయి ఇండియన్స్​ మరోసారి ట్రోఫీని దక్కించుకుంది. దీంతో లీగ్​ చరిత్రలోనే అత్యధికంగా ఐదు సార్లు కప్​ను గెలుచుకున్న ఏకైక జట్టుగా ముంబై నిలిచింది. మొదటిసారి ఫైనల్​ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్​.. రన్నరప్‌గా నిలిచింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ పరుగుల వరద పారింది 44 మ్యాచ్‌ల్లో 55.83 యావరేజ్‌, 129.34 స్ట్రైక్ రేట్‌తో అత్యధికంగా 670 పరుగులు చేశాడు. దీంతో అతడు ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. ఇక ఈ సీజన్‌లో 17 మ్యాచ్‌లు ఆడిన రబాడా 30 వికెట్ల తీసి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు.

ఈ సీజన్‌లో 17 మంది ఇండియన్ ప్లేయర్స్ 250 లేదా అంత కంటే ఎక్కువ పరుగులు చేయగా.. 15 మంది భారత బౌలర్లు 10 కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టారు. కానీ ఒకే ఒక ఇండియా ఆల్‌రౌండర్ మాత్రమే 250కిపైగా రన్స్ చేయడంతోపాటు 10 వికెట్లు తీశాడు. అతడే రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ రాహుల్ తెవాతియా. ఈ సీజన్‌లో ఇండియాకు దొరికిన అత్యంత శక్తివంతమైన ప్లేయర్ ఇతడే.