రాష్ట్రంలో వింత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాన ఓటు బ్యాంకు బీసీల మీద ఎవరికి వారు సొంత స్ట్రాటజీలు ప్రయోగిస్టూన్నారు. ఒకవైపు అధికార పార్టీ వైసీపీ బీసీల కోసం ప్రత్యేక కార్పోరేషన్లు ఏర్పాటు చేసింది. దేశంలో ఏ పార్టీ పెట్టనన్ని కార్పోరేషన్లను పెట్టింది. బీసీల్లో ఉన్న ఒక్కొక్క కులానికి ఒక్కో కార్పోరేషన్. ఒక్కో కార్పొరేషనుకు ఒక్కో చైర్మన్, కొంత మంది డైరెక్టర్లు. ఈ కార్పొరేషన్లకు నిధులు కేటాయిస్తారో లేదో తెలీదు కానీ ఇప్పటికైతే జగన్ ఫార్ములా విజయవంతంగానే నడుస్తోంది. బీసీలు జగన్ చేసిన పనికి ఖుషీగా ఉన్నారు. ఇక చంద్రబాబు నాయుడు అయితే కొత్తగా కేటాయించిన పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జులుగా బీసీ నేతలను ఎక్కువగా నియమించారు.
ఇలా వచ్చే ఎన్నికలకు ఎవరికి వారు బీసీలను ప్రసన్నం చేసుకోవడానికి విపరీత ప్రయత్నాలు చేస్తూ ఉంటే మరోవైపు ఈ ఇద్దరికీ షాకిచ్చే విధంగా బీసీలంతా కలిసి కొత్త పార్టీ పెట్టాలనే యోచనలో ఉన్నారట. తాజాగా రాష్ట్రంలో ఉన్న బీసీ నేతలు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని చర్చలు జరిపారు. చర్చల అనంతరం వారంతా కలిసి సపరేట్ పొలిటికల్ పార్టీని స్థాపించాలని అనుకుంటున్నట్టు తెలియజేశారు. అయితే సమావేశంలో ఏయే కులాల పెద్దలు హాజరయ్యారనేది మాత్రం తెలియజేయలేదు. రాజకీయ పార్టీల నడుమ ఇరుక్కుని బీసీలు నలిగిపోతున్నారనేది వీరి బాధట.
ఇంతవరకు ఏ పార్టీ కూడా వీరికి సరైన న్యాయం చేయట్లేదట. రిజర్వేషన్ల విషయంలో ఇంతవరకూ ఒక స్పష్టత రాలేదని, తమ పార్టీ లక్ష్యం బీసీల అభివృద్దేనని అంటున్నారు. అయితే వీరు పెట్టబోయే పార్టీకి బీసీల నుండి ఎంత మేరకు మద్దతు లభిస్తుందనేది తేలాల్సిన విషయం. ఇంకొక కొసమెరుపు ఏమిటంటే బీసీ జనాల్లోనే ఈ పార్టీ పట్ల అనేక అనుమానాలున్నాయి. పెద్దలు కొందరు నిజంగానే బీసీల ప్రయోజనం కోసం పార్టీ పెట్టాలని అనుకుంటున్నారా లేకపోతే వీరి వెనుక ఏదైనా రాజకీయ పార్టీ ఉందా అనే సందేహాలు వెలిబుచ్చుతున్నారు. ఒకవేళ ఎన్నికల్లో ఈ పార్టీ నిలబడి పోలింగ్ సమయానికి ఏదో ఒక పెద్ద పార్టీకి మద్దతు ప్రకటించి షాకివ్వదు కదా అని కూడ మాట్లాడుకుంటున్నారు. అయితే ఇవేవీ జరగకుండా బీసీ నేతలు పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకు వెళ్లగలిగితే మాత్రం వైసీపీ, టీడీపీల బీసీ ఓటుబ్యాంకుకు ఒకింత గండిపడే అవకాశం ఉంది.