గ్రేటర్ ఎన్నికల సమయంలో తెలంగాణ బీజేపీలోకి వలసలు ఎక్కువగానే జరుగుతున్నాయి. కాంగ్రెస్ నుండి విజయశాంతి, తెరాస నుండి స్వామి గౌడ్ లాంటి నేతల బీజేపీ గూటికి చేరుకుంటున్నారు, ఇదే సమయంలో సినీ పరిశ్రమకు చెందిన బండ్ల గణేష్ కూడా బీజేపీ లో చేరబోతున్నాడు అంటూ బీజేపీ సోషల్ మీడియా వేదికల్లో ప్రచారం జరుగుతుంది.
తాజాగా దీనిపై బండ్ల గణేష్ మాట్లాడుతూ బీజేపీలో చేరడం లేదని స్పష్టంచేశాడు. అంతేకాదు.. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, ఎలాంటి రాజకీయాలతో సంబంధం లేదని విస్పష్టంగా ప్రకటించారు. బండ్ల గణేష్ గురువుగా భావించే పవన్ కల్యాణ్ కూడా బీజేపీకి బహిరంగంగా మద్దతు తెలిపిన నేపథ్యంలో.. బండ్ల గణేష్ కూడా అదే బాటలో పయనిస్తారని, భారతీయ జనతా పార్టీలో చేరతారని ప్రచారం ఊపందుకుంది. దీంతో ఆయన తన పొలిటికల్ కెరీర్ పై మరోసారి స్పందించాల్సి వచ్చింది.
2018 ఎన్నికల సమయంలో జాతీయ స్థాయి నాయకత్వం సమక్షములో కాంగ్రెస్ పార్టీలో చేరి అధికార ప్రతినిధి హోదా పొంది, అనేక మీడియా డిబేట్స్ లో హడావిడి చేశాడు , కాంగ్రెస్ గెలవకపోతే ”7ఓ క్లాక్” బ్లేడుతో గొంతు కోసుకుంటానని సవాల్ విసిరారు. ఆ డైలాగ్ అప్పట్లో బాగా వైరల్ అయింది. ఆ తర్వాత కాంగ్రెస్ ఓడిపోవడం, బండ్ల గణేశ్ తన సవాల్ నుంచి వెనక్కు తగ్గడం చకచకా జరిగిపోయాయి.
కొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉన్న బండ్ల గణేష్ ఇటీవలి ఒక వేదిక మీద మాట్లాడుతూ ఇక రాజకీయాల నుండి తప్పుకుంటున్నానని, నాకు సినిమాలు సెట్ అవుతాయి తప్ప రాజకీయాలు సెట్ కావంటూ ప్రకటించాడు, అయినా కానీ బండ్ల గణేష్ పొలిటికల్ కెరీర్ పై ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. బండ్ల బీజేపీలోకి రాబోతున్నాడు అంటూ కొన్ని బీజేపీ పేజీ లో వచ్చిన వార్తల నేపథ్యంలో ఆయన తాజాగా ప్రకటన చేసి, బీజేపీలోకి చేరటం లేదని క్లారిటీ ఇచ్చాడు.