తెలంగాణలో బీజేపీ పార్టీ తన దూకుడు చూపిస్తూ ముందుకి వెళ్తుంది. వచ్చే సాధారణ ఎన్నికల నాటికీ తెరాస కి తమకి మధ్య ప్రధాన పోటీ ఉండాలని, రాష్ట్రంలో తామే సరైన పోటీదారులమని నిరూపించుకోవడానికి సర్వ శక్తులు ఒడ్డి పోరాటం చేస్తుంది. ఈ పోరాటంలో తెలంగాణ బీజేపీ చీఫ్ ఎంపీ బండి సంజయ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా నియమితుడైన నాటి నుండి రాష్ట్రంపై బీజేపీ పట్టు పెరిగేలా చేయటంలో విజయవంతం అవుతున్నాడు.
ఎప్పుడైతే పూర్తిగా రాష్ట్ర రాజకీయాల మీద దృష్టి పెట్టాడో అప్పటి నుండి తన సొంత నియోజకవర్గమైన కరీంనగర్ ను దూరం పెట్టాడనే మాటలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో పార్టీలో కూడా చీలికలు రావటం మొదలైనట్లు తెలుస్తుంది. దీనితో బండి సంజయ్ ఇప్పుడు సొంత ఇలాఖా పై దృష్టి పెట్టాడు. కరీంనగర్ లోని 60 డివిజన్స్ ను 12 భాగాలుగా చేసి, ఒక్కో భాగానికి ఒక్కో కీలక నేతను నియమించాడు. అంతే కాకుండా నార్త్,ఈస్ట్,వెస్ట్,సౌత్ , సెంట్రల్ అంటూ విభజించి ఐదుగురు అధ్యక్షులను నియమించాలని భావిస్తున్నాడు. గ్రేటర్ హైదరాబాద్ లో అనుసరించిన బెంగళూర్ వ్యూహాన్ని కరీంనగర్ లో అనుసరిస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో కరీంనగర్ లో వున్నప్పుడు బండి సంజయ్ కి విపరీతమైన ఆదరణ ఉండేది, ఎప్పుడైతే అధ్యక్షుడు అయ్యాడో అప్పటి నుండి సొంత నియోజకవర్గంలో అతని హవా తగ్గింపోతున్నట్లు గమనించాడు.
ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సామెత మళ్ళీ గుర్తు చేసుకున్నాడేమో కానీ, ఇప్పుడు కరీంనగర్ లో తన మార్క్ రాజకీయం చూపించటం మొదలుపెట్టాడు. హైదరాబాద్ తర్వాత కరీంనగర్ ను తన అడ్డాగా మార్చుకోవాలని, ఈ రెండు చోట్ల బీజేపీకి పట్టు పెగితే టోటల్ తెలంగాణాలో పార్టీకి పట్టు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న బండి సంజయ్ రెండు చోట్ల ఒకే రకమైన సూత్రాన్ని అప్లై చేస్తున్నాడు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ ను ఐదు భాగాలుగా విభజించి ఒక్కో దానికి ఒక్కో అధ్యక్షుడిని నియమించి ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు. అచ్చం కరీంనగర్ లో కూడా ఇలాగే చేస్తున్నాడు. రేపొద్దున్న హైదరాబాద్ లో ఈ ప్లాన్ సక్సెస్ అయితే అదే సూత్రాన్ని రాష్ట్రము మొత్తం అమలుచేయాలనే ఉద్దేశ్యంతో బండి సంజయ్ ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఆయన ప్లాన్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో లేదో గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో తేలిపోతుంది.