Bandi Sanjay Arrest : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు వ్యవహారంతో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి గడ్డు కాలం ఎదురు కాబోతోందా.? అంటే, ఔననే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. తమ పార్టీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడ్ని అరెస్టు చేయడాన్ని బీజేపీ అధిష్టానం చాలా సీరియస్‌గా తీసుకుందట. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఈ విషయమై గుస్సా అయ్యారు. స్వయంగా ఆయనే బండి సంజయ్ అరెస్టుని ఖండిస్తూ, సంఘీభావం తెలిపారు.. హైద్రాబాద్ కూడా వచ్చారు.
ఇదిలా వుంటే, తన అరెస్టుపై బండి సంజయ్, లోక్‌సభ స్పీకర్‌కి ఫిర్యాదు చేశారు. వెంటనే లోక్ సభ స్పీకర్ కూడా స్పందించి, బండి సంజయ్ అరెస్టుపై ఆరా తీయడంతోపాటు, ఈ ఘటనలో నిజాలు నిగ్గు తేల్చాలంటూ కేంద్ర హోం శాఖకు ఆదేశాలు జారీ చేశారట.
శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తనను అవమానకరమైన రీతిలో తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారన్నది బండి సంజయ్ ఆరోపణ. మరోపక్క, తెలంగాణలో ఒమిక్రాన్ విజృంభణ, కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రాజకీయ పరమైన కార్యక్రమాలపై ఆంక్షలున్నాయనీ, ఆ ఆంక్షల్ని బండి సంజయ్ ఉల్లంఘించారని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు.
ఎవరి వాదన వారిదే.! న్యాయస్థానం బండి సంజయ్ బెయిల్ తిరస్కరించడంతోపాటు ఆయన్ని రిమాండ్‌కి పంపడంతో, తెలంగాణ పోలీసుల వాదనదే పై చేయిగా మారినట్లయ్యింది. అది పరోక్షంగా తెలంగాణలో అధికార పార్టీ గెలుపుగా మారింది.
ఇక్కడే, బీజేపీ అధిష్టానం ఒకింత అసహనానికి గురైనట్లుగా తెలుస్తోంది. బండి సంజయ్ ద్వారా లోక్ సభ స్పీకర్‌కి ఫిర్యాదు చేయించి, నేరుగా కేంద్ర హోం శాఖను రంగంలోకి దించినట్లుగా ప్రచారం జరుగుతోంది. కేంద్ర హోం శాఖ గనుక సీరియస్ చర్యలు చేపడితే, తెలంగాణలోని అధికార పార్టీకి, తెలంగాణ ప్రభుత్వానికీ తిప్పలు తప్పేలా లేవు.