ఎన్టీయార్ బయోపిక్కు.. బాలయ్యకే ‘ఆ రాత’ సాధ్యం.!

Balayya To Write BioPic Of Sr NTR

Balayya To Write BioPic Of Sr NTR

స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి రోజున ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ తనదైన స్టయిల్లో ప్రవచనాలు వదిలేశారు. బాలయ్య పండితుడే.. కానీ, దాన్ని చాటుకునే క్రమంలో ఆయన పడే పాట్లు మాత్రం కడుపుబ్బా నవ్విస్తుంటాయి. తన తండ్రి జయంతి రోజున బాలయ్య తన పాండిత్యాన్ని చాటుకునేందుకు చాలా కష్టాలే పడ్డారు. ఆ సంగతి పక్కన పెడితే, స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్రను పుస్తకాలుగా చాలామంది రాశారు.

పార్టులు పార్టులుగా పుస్తకాలు రాసినోళ్ళున్నారు.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఫిలిం మేకర్ రామ్ గోపాల్ వర్మ కూడా ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ అంటూ ఓ సినిమా తీశాడు. బాలయ్య ఏమన్నా తక్కువ తిన్నాడా.? ఆయనా స్వర్గీయ ఎన్టీయార్ జీవిత చరిత్రను రెండు భాగాలుగా (ఎన్టీయార్ కథానాయకుడు.. ఎన్టీయార్ మహానాయకుడు) అంటూ సినిమాలు తీసిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.? దారుణం ఏంటంటే, ఆర్జీవీ సినిమా వివాదాస్పదమయ్యింది.. బాలయ్య సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. సినిమా కాదు.. సినిమాలు. ఆ రెండు సినిమాల పరాజయం, స్వర్గీయ ఎన్టీయార్ అవమానపడ్డారనడానికి నిదర్శనమంటారు చాలామంది. ఆ సంగతి పక్కన పెడితే, బాలయ్య ఈసారి తన తండ్రి జీవిత చరిత్రను పుస్తకంగా రాస్తానంటూ అందర్నీ భయపెట్టేస్తున్నారు.

భయపెట్టడమేంటి.? అంటే, ఔను మరి.. సినిమా తీసి, స్వర్గీయ నందమూరి తారకరామారావు పట్ల ప్రజల్లో వున్న గౌరవాన్ని చెడగొట్టారనే విమర్శలు బాలయ్య మీద వున్నాయ్ కదా. అందుకే, బాలయ్య నుంచి పుస్తకం.. అదీ స్వర్గీయ ఎన్టీయార్ జీవిత చరిత్ర.. అంటే భయపడకుండా వుంటారా.? ‘నాకే పూర్తిగా తెలుసు.. నేను రాస్తేనే అది బావుంటుంది..’ అని బాలయ్య అంటోంటే, ఔనౌను.. ఆ రాత బాలయ్యబాబుకే సాధ్యమంటూ ఆయనగారి అభిమానులూ చెబుతున్నారండోయ్.