Teja Sajja: తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తేజా కొన్ని సినిమాలలో నటించి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చూడాలని ఉంది, కలిసుందాం రా, గంగోత్రి, ఛత్రపతి లాంటి చాలా సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఆ తర్వాత జాంబీ రెడ్డి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత విడుదల అయిన హనుమాన్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు తేజ. ఇది ఇలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ తన వ్యక్తిగత జీవితం గురించి ముఖ్యంగా తన తండ్రి గురించి అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా తేజా సజ్జా మాట్లాడుతూ.. నాకు ఊహ తెలిసినప్పట్నుంచి మా నాన్నగారు వృత్తి రీత్యా బిజీగా ఉండేవారు. కానీ ఆదివారం మాత్రం నన్ను కూడా తనతో పాటు ఆఫీస్‌కు తీసుకుని వెళ్లేవారు. అక్కడ అందరూ పని చేస్తుంటే ఆసక్తిగా గమనించేవాడిని. అలా వెళ్లడం వల్లనో ఏమో నా ఆరేళ్ల్ల వయసుకే స్కూలు, సినిమా షూటింగ్ లు వంటి పరిసరాల్లో నేను చాలా మామూలుగా ఉండగలిగాను. ఎలాంటి బెదురు లేకుండా షూటింగ్ చేసేవాణ్ణి అని తెలిపారు. నాన్నకి నేనంటే చాలా నమ్మకం. నా ఇష్టా ఇష్టాలకు, నా నిర్ణయాలకు ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. చదువు, సినిమాలు ఇలా నన్ను అన్ని విషయాల్లోనూ ప్రోత్సహించారు. నాన్నకు మొదట్లో సినిమాలంటే ఇష్టం ఉండేది కాదు. కానీ ఒకటి, రెండు సినిమాలు అయ్యాక నేను షూటింగ్స్ ను పిక్నిక్ లా ఎంజాయ్ చేస్తున్నానని నన్ను వెళ్లనిచ్చారు.
ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అయ్యాక ధైర్యం చేసి, నాన్న దగ్గరికి వెళ్లి ఈ చదువు నా వల్ల కావడం లేదు. సినిమా ఇండస్ట్రీకి వెళ్తాను అని చెప్పాను. టీవీ చూస్తున్న నాన్న కనీసం తల కూడా తిప్పకుండా సరే నీ ఇష్టం అన్నారు. అలా ఒక్క మాట కూడా అడగకుండా నాకు ఇష్టమైన కెరీర్ ని ఎంచుకునేలా ప్రోత్సహించేసరికి, ఒక బాధ్యతలా భావించి, పట్టుదలతో పని చేస్తున్నాను అని చెప్పుకొచ్చాడు తేజ. నా లైఫ్‌లో మా నాన్నే నా హీరో. ఒక మామూలు వ్యక్తిగా లైఫ్ స్టార్ట్ చేసి, తన వృత్తిలో ఉన్నత స్థాయికి ఎదిగారు. కుటుంబంలో ఉన్న అందరి బాధ్యతలతో పాట బంధువుల్లో ఎంతో మందికి చదువు, ఉద్యోగం, పెళ్లి వంటి వాటికి హెల్ప్ చేశారని తెలిపాడు. నా లైఫ్‌లో మా నాన్న నాకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ అంటే చాలా చిన్న వయసులోనే నాకు సంబంధించినవి నేనే ఎంచుకునే ఫ్రీడమ్. వీటివల్లే నేను సొసైటీలో తిరిగి, చాలామంది వ్యక్తులను కలిసి, అన్ని రకాల పరిస్థితులను దగ్గరగా చూసి, ఆలోచించి, అందుకు తగ్గట్టు ప్రవర్తించడం నేర్చుకున్నాను. సినిమా షూటింగ్, ఇతర పనులతో ఎంత బిజీగా ఉన్నా నాన్నతో కూర్చుని మాట్లాడతాను. అయితే ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు వరుస సినిమాల వల్ల నిజంగానే నాన్నగారితో ఎక్కువ సమయం గడపడానికి కుదరడం లేదు. అదో చిన్న లోటులా అనిపిస్తూ ఉంటుంది అని తన తండ్రి గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చారు తేజా.