BJP Political Style : నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుంది బీజేపీ నేతల తీరు. ఔను, ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఇదే వాస్తవం. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఏమైనా మార్పు వచ్చిందా.? అప్పుడూ ఆయన బెయిల్ మీదనే వున్నారు.. ఇప్పుడూ బెయిల్ మీదనే వున్నారు. మరి, బెయిలు మీదున్నోళ్ళు జైలుకు వెళతారంటూ బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ జవదేకర్ ఎలా వ్యాఖ్యానించగలుగుతున్నారు.?
అక్రమాస్తుల కేసుకు సంబంధించి వైఎస్ జగన్ తప్పు ఎంత.? అన్నది కోర్టులు తేల్చాలి. కానీ, జైలుకు పంపిస్తామంటూ బీజేపీ బెదిరించడమేంటి.? తెలంగాణలోనూ ఇదే రాజకీయం.. కేసీయార్‌ని జైలుకు పంపిస్తామంటూ బీజేపీ నేతలు పదే పదే చెబుతున్నారు. అలాంటి వ్యాఖ్యలతో తెలంగాణలో బీజేపీ కొంతమేర బలమపడిన మాట వాస్తవం.
కానీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇందుకు పూర్తి భిన్నం. ఏపీలో బీజేపీ పప్పులుడకవ్. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, రైల్వే జోన్ సంగతి తేల్చలేదు. చెప్పుకుంటూ పోతే, ‘పాడిందే పాటరా..’ అన్నట్టు తయారవుతుంది. అన్ని సమస్యలున్నాయి కేంద్రం పరిష్కరించాల్సినవి. ఇవేవీ పరిష్కరించరుగానీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జైలుకు మాత్రం పంపించేస్తారట.
ఎవర్ని మభ్యపెట్టడానికి బీజేపీ నేతలిలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్టు.? అంటే, కేంద్రంలో అధికారంలో వుంది కాబట్టి.. రాష్ట్రాల్లో అధికారంలో వున్నవారి మీద కక్ష సాధింపు చర్యలకు దిగుతారన్నమాట. లేదంటే, అలా బెదిరింపులతో రాజకీయంగా పబ్బం గడుపుకుంటారన్నమాట.
ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ నాయకుల వ్యాఖ్యల్ని సమర్థిస్తారా.? దేశాన్ని పరిపాలిస్తున్న మోడీ, ఆయా రాష్ట్రాల్లో ఇలాగే అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారా.? తెలుగు ప్రజలకే కాదు, దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలిప్పుడు.