వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇటీవల దాఖలు చేసిన పిటిషన్ విషయమై ఈ రోజు విచారణ జరిగింది. పలు దఫాలు కౌంటర్ దాఖలు చేయడంలో అసత్వం ప్రదర్శించిన జగన్ తరఫు న్యాయవాదులు, ఎట్టకేలకు కౌంటర్ దాఖలు చేశారు. రాజకీయ దురుద్దేశాలతోనే రఘురామ, వైఎస్ జగన్ బెయిల్ రద్దు కోసం పిటిషన్ దాఖలు చేశారు తప్ప, వైఎస్ జగన్ ఏనాడూ బెయిల్ నిబంధనల్ని ఉల్లంఘించలేదని కౌంటర్ ద్వరా జగన్ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. రఘురామ, పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడటంతో ఆయపై ‘లోక్ సభ స్పీకర్’కు ఫిర్యాదు చేశామనీ, రాష్ట్రంలో ఎనిమిది కేసులు ఆయనపైన నమోదయ్యాయనీ జగన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోరడానికి ఆస్కారం వుందనీ, మూడో వ్యక్తికి ఇలాంటి కేసుల్లో ప్రమేయం వుండకూడదనీ, ఇందుకు సంబంధించి గతంలో పలు తీర్పులు వున్నాయని జగన్ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు.
వాదోపవాదాల అనంతరం, కేసు విచారణను ఈ నెల 14వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసినట్లు తెలుస్తోంది. రఘురామ తరఫు న్యాయవాది పది రోజులు గడువు అడగడంతోనే, విచారణ వాయిదా పడినట్లు సమాచారం. కాగా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రిగా వున్నారనీ, ప్రభుత్వం తరఫున కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వున్నందున, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ న్యాయస్థానాన్ని కోరగా, న్యాయస్థానం అనుమతించిందనీ, కుంటి సాకులతో వ్యక్తిగత విచారణకు హాజరు కావడంలేదంటూ పిటిషన్ దారు పేర్కనడం అర్థ రహితమని జగన్ తరఫు న్యాయవాదులు సీబీఐ కోర్టుకు విన్నవించారు. ఇదిలా వుంటే, జగన్ బెయిల్ రద్దు విషయమై కోర్టు ‘మెరిట్స్’కి లోబడి నిర్ణయం తీసుకోవచ్చని సీబీఐ, సింపుల్ లైన్ ద్వారా కౌంటర్ దాఖలు చేయడం గమనార్హం.