వైసీపీ రెబల్ ఎంపీ, నర్సాపురం లోక్ సభ సభ్యుడు రఘురామకృష్ణరాజుకి కాస్తంత ఊరట దక్కింది. సొంత నియోజకవర్గం నర్సాపురం వెళ్ళేందుకు న్యాయస్థానం ద్వారా వీలు కలిగింది రఘురామకృష్ణరాజుకి. ప్రధాని నరేంద్ర మోడీతోపాటు భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణకు హాజరు కావాల్సి వుందనీ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు తను ఏదో ఒక కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నందున తనకు వారి నుంచి రక్షణ కావాలని కోర్టును ఆశ్రయించారు రఘురామ.
కోర్టు ఆయనకు కాస్త ఊరటనిచ్చింది. ఆయనపైన కేసుల విషయమై ‘పద్ధతి ప్రకారం నడుచుకోవాలి’ అని హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సూచించింది. 3, 4 తేదీల్లో ఎలాంటి అత్యుత్సాహం ప్రదర్శించవద్దని కూడా హైకోర్టు, ఏపీ పోలీసులకు సూచించినట్లుగా రఘురామ తరఫు న్యాయవాదులు చెబుతున్నారు.
నిజంగానే, ఆంధ్రప్రదేశ్ పోలీసులు రఘురామని ‘బుక్’ చేయాలనుకుంటున్నారా.? అంటే, గతంలో ఆయన్ని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఇంకోసారి ఆయన్ని అరెస్టు చేయాలనుకుంటే, ఆయన ఎక్కడున్నా అరెస్టు చేసేవారే. సొంత నియోజకవర్గానికి రఘురామ రాకపోవడానికి అనేక కారణాలున్నాయి. స్థానికంగా వైసీపీ క్యాడర్ తనకు సహకరించదని రఘురామకు తెలుసు. సొంతంగా ఆయనకున్న రాజకీయ బలమేంటో ఆయనకు తెలుసు.
సరే, రఘురామ తన గురించి తాను ఎక్కువ ఊహించుకోవడమనేది అందరికీ తెలిసిన విషయమే. అయినాగానీ, ఆయన ఇప్పుడు ఎంపీ. లోక్ సభ సభ్యుడు గనుక, ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు కొన్ని గౌరవాలు దక్కాలి. కొన్ని కార్యక్రమాల్లో ఆయన పాల్గొనాలి. ప్రధాని హాజరయ్యే కార్యక్రమం గనుక, అక్కడ తన ‘పవర్’ చూపించుకోవాలని రఘురామ తహతహలాడుతున్నారు. అది సాధ్యమవుతుందా.? అన్నది వేచి చూడాల్సిందే.