బీజేపీ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం చూస్తోన్న రఘురామ.?

raghurama

వచ్చే ఎన్నికల్లో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తిరిగి నర్సాపురం లోక్ సభ సీటు నుంచి పోటీ చేస్తారా.? ఇంకోసారి ఆయన నర్సాపురం ఎంపీగా గెలుస్తారా.? లేదా.? ఈ విషయమై జోరుగా బెట్టింగులు కూడా జరుగుతున్నాయి. గెలవడం, పోటీ చేయడం సంగతి తర్వాత, ముందైతే.. నియోజకవర్గంలోనే అడుగుపెట్టనివ్వం.. అంటోంది వైసీపీ.

మరి, రఘురామ ముందున్న ఆప్షన్ ఏంటి.? వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం రఘురామ ఎదురు చూస్తున్నారట. బీజేపీ నుంచి పోటీ చేసే ఉద్దేశ్యం ఆయనకు లేదుగానీ, బీజేపీ ఆశీస్సులతో జనసేన లేదా టీడీపీ నుంచి పోటీ చేయాలన్నది రఘురామ ఆలోచనగా కనిపిస్తోంది.

అయితే, బీజేపీ మాత్రం రఘురామను ఎంటర్టైన్ చేసేందుకు సుముఖంగా లేదు. బీజేపీ నుంచి పోటీ చేస్తానంటే మాత్రం రఘురామకు కమలదళం ఆహ్వానం పలికే అవకాశం వుందంటున్నారు. అయితే, బీజేపీకి ఏపీలో వున్న సీన్ నేపథ్యంలో రఘురామ రిస్క్ చేయలేకపోతున్నారు.

పైగా, ప్రధాని తన నియోజకవర్గంలో పర్యటించినా, తనకు ప్రోటోకాల్ ప్రకారం అవకాశమివ్వకపోవడంపై రఘురామ ఒకింత ఆవేదన చెందుతున్నారు.. బీజేపీ మీద కినుకతో కూడా వున్నారు. ఈ నేపథ్యంలో రఘురామ భవిష్యత్ కార్యాచరణ ఏంటన్నది హాట్ టాపిక్‌గా మారింది.

జనసేనలోకి వెళ్ళాలని వున్నా, ఒకింత రఘురామ మొహమాటపడుతున్నారట. 2019 ఎన్నికల్లో రఘురామ చేతిలోనే పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఓడిపోయారు. రఘురామ పోటీ చేసిన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో పవన్ కూడా ఓడిపోయిన సంగతి తెలిసిందే.