బద్వేలు బై పోల్: వైసీపీకి వచ్చే మెజార్టీ ఎంతంటే..

కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో అధికార వైసీపీ సాధించబోయే మెజార్టీ ఎంత.? అన్నదానిపై మీడియా, రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. సిట్టింగ్ స్థానాన్ని అధికార వైసీపీ నిలబెట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే, మెజార్టీ మీదనే వైసీపీ ఫోకస్ పెట్టింది.

‘ఖచ్చితంగా బంపర్ విక్టరీ సాధిస్తాం. ఆ మెజార్టీ పెంచుకోవడం కోసమే ఈ ప్రచారం..’ అంటూ వైసీపీ నేతలు రోజా తదితరులు ఇప్పటికే స్పష్టం చేసిన విషయం విదితమే. ‘కనీసం లక్ష మెజార్టీ సాధిస్తాం..’ అంటున్నారు పలువురు ఎంపీలు, మంత్రులు.

కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య కొన్నాళ్ళ క్రితం అనారోగ్యంతో కన్నుమూయడంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక తప్పనిసరైంది. వెంకట సుబ్బయ్య సతీమణి స్వయంగా బరిలోకి దిగడంతో, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీతోపాటు, మరో విపక్షం జనసేన కూడా పోటీ నుంచి తప్పుకుంది.

అయితే, తగుదునమ్మా.. అన్నట్టు బలం లేకపోయినా, బీజేపీ రంగంలోకి దిగింది. కాంగ్రెస్ పార్టీ సంగతి సరే సరి. కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా బద్వేలు ఉప ఎన్నికలో డిపాజిట్ కోసమే ప్రయత్నించాలి తప్ప.. గెలుపు కోసం పోటీ పడే పరిస్థితే లేదన్న చర్చ నియోజకవర్గంలో జరుగుతోంది.

కాగా, జనసేన తాము బరిలోకి దిగకపోయినా, బీజేపీ అభ్యర్థికి మద్దతిస్తున్నామంటూ వింత వాదనకు తెరలేపడం గమనార్హం. మరోపక్క, టీడీపీ కూడా తెరవెనుకాల బీజేపీకి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తోంది. ఈ నేపథ్యంలో లక్ష మెజార్టీ వైసీపీకి సాధ్యమేనా.? అన్న చర్చ జరుగుతోంది.