సాధారణంగా ఉప ఎన్నిక అంటే ఓటర్లలో కొంత ఆసక్తి తక్కువ వుంటుంది. ప్రధాన ప్రతిపక్షం బరిలో లేకపోవడంతో చప్పగా ప్రచారం సాగింది.. అంతకన్నా చప్పగా పోలింగ్ జరిగిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేయడం సహజమే. కానీ, ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాల ఫలాలు అందాయని అధికార వైసీపీ చెబుతోంది.
మరి, ఓటర్లెందుకు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తలేదు.? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఓటర్లకు ఓట్లేయడమ్మీద ఆసక్తి లేదంటే, అది మామూలు విషయం కాదు. దీన్ని ప్రభుత్వ వ్యతిరేకతగా కొందరు అభిప్రాయపడే అవకాశం లేకపోలేదు. అలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కూడా.
ఎటూ, వైసీపీ గెలుపు ఖాయం కాబట్టి, వైసీపీ ఓటు బ్యాంకులో కొంత నిర్లక్ష్యం, ప్రతిపక్షం బరిలోకి దిగలేదు గనుక.. టీడీపీ మద్దతుదారులెవరూ ఓట్లేయడానికి వెళ్ళలేదన్న అంచనాలు.. ఇలా కారణాలు ఎన్నయినా వెతుక్కోవచ్చు. కానీ, తక్కువ ఓటింగ్ నమోదవడాన్ని అధికార పార్టీ సమర్థించుకోలేని పరిస్థితి.
టీడీపీ ఏజెంట్లు, బీజేపీ తరఫున పని చేశారంటే.. టీడీపీ ఓటర్లు ఖచ్చితంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి వుండాలి. బీజేపీకి మిత్రపక్షం జనసేన మద్దతు వుంది గనుక.. అట్నుంచి కూడా హైప్ వున్నట్లే లెక్క. ఎలా చూసినా, ఓటింగ్ తగ్గడానికి కారణం వైసీపీ ఓటు బ్యాంకేనన్న అనుమానాలు తలెత్తడం సహజమే.
సంక్షేమ పథకాలు అందుకుంటున్న ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించలేకపోవడం ముమ్మాటికీ అధికార పార్టీ వైఫల్యమే. ఎవరు గెలుస్తారన్నది వేరే చర్చ. కానీ, నైతికంగా వైసీపీ ఓడిపోయిందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ‘ఇది గెలవలేనివారు చెప్పే కుంటి సాకు..’ అన్నది వైసీపీ వాదనే అయినా, ఇప్పుడు తేరుకోకపోతే, వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ పరిస్థితి కష్టంగా మారొచ్చు.