బద్వేలు బై పోల్ ఫలితంతో బీజేపీలో ఫుల్ జోష్.!

గెలిచేది లేదని తెలిసీ, బరిలోకి దిగిన భారతీయ జనతా పార్టీ బద్వేలు ఉప ఎన్నికలో ఓ మోస్తరుగా ఓట్లను రాబట్టింది. ‘జీరో’ పార్టీ కాస్తా, అదికార పార్టీకి ప్రధాన పోటీ దారుగా మారడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు కదా. అదే, అలా పోటీ ఇవ్వగలిగినందుకే బీజేపీలో పండగ వాతావరణం కనిపిస్తోంది.

ఏపీ బీజేపీని ఉద్దేశించి బీజేపీ జాతీయ నాయకత్వం ప్రశంసల వర్షం కురిపించేస్తోంది సోషల్ మీడియా వేదికగా. ‘ఏపీ బీజేపీ బాగా పోరాడింది.. చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లను సాధించగలిగింది..’ అంటూ జాతీయ నాయకులు ట్వీట్లు వేస్తోంటే, ఏపీ బీజేపీ నేతలు మురిసిపోతున్నారు.

నిజానికి, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ బరిలోకి దిగి వుంటే, బీజేపీ సీన్ అస్సలు కనిపించేది కాదు. బీజేపీని లేపడానికే టీడీపీ, ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకుందేమో అనుకోవాలి. వాస్తవానికి ఉప ఎన్నిక బరి నుంచి తొలుత తప్పుకున్నది జనసేన. ఆ జనసేన బాటలోనే, టీడీపీ కూడా చేతులెత్తేసింది.

అన్నట్టు, కాంగ్రెస్ పార్టీ కూడా ఓ మోస్తరుగా ఓట్లు సంపాదించుకుంది బద్వేలులో. చిత్రమేంటంటే, తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఓట్ల కంటే, బద్వేలులో కాంగ్రెస్ సాధించిన ఓట్లు ఎక్కువ. అలా ఆ పార్టీ కూడా ఒకింత మురిసిపోవడానికి అవకాశం వుంది.

రాజకీయం మరీ ఇంతలా చీప్ అయిపోయిందేంటి జాతీయ పార్టీలకి.? అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్, బీజేపీ చేసిన అన్యాయం అలాంటిది.. ప్రజలు అంతలా చీత్కరిస్తున్న దరిమిలా, వచ్చిన ఈ ఓట్లూ పరమానందమే.. అనుకోక ఏం చేస్తారు మరి.?

ఇదే ఆనందం ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ కొనసాగిస్తే మంచిది. కానీ, ఎప్పుడూ ఇవే నంబర్లుండవ్.. సార్వత్రిక ఎన్నికల నాటికి సీన్ మారుతుంది.. అప్పుడు మళ్ళీ జీరో అవడం తప్పదు. ఒకవేళ ప్రధాన ప్రతిపక్షం ఆ ఎన్నికల్నీ బహిష్కరిస్తే.. అది కాంగ్రెస్, బీజేపీలకు వరమే అవుతుందని నిస్సందేహంగా చెప్పొచ్చు.