ఆంధ్రప్రదేశ్‌లో బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికీ, తెలంగాణలో హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికీ ఉప ఎన్నికలు జరుగుతోన్న విషయం విదితమే. ఈ రెండిటిలోనూ గెలిచెయ్యాలని భారతీయ జనతా పార్టీ తెగ ఆరాటపడిపోతోంది. తెలంగాణలోని హుజూరాబాద్ మీద బీజేపీకి కాస్త ఎక్కువ ఆశలు వున్నాయ్.
అయితే, అటు బద్వేలులోగానీ, ఇటు హుజూరాబాద్ నియోజకవర్గంలోగానీ బీజేపీ ఆశలు ఫలించే అవకాశాలు కనిపించడంలేదు. హుజూరాబాద్ విషయానికొస్తే నిన్న మొన్నటిదాకా బీజేపీ మీద ఒకింత హైప్ వుండేది. సిట్టింగ్ ఎమ్మెల్యే, అధికార పార్టీకి రాజీనామా చేసి.. మంత్రి పదవికీ రాజీనామా చేసి బీజేపీలో చేరడమే అందుక్కారణం.
కానీ, సీన్ మారింది. క్రమక్రమంగా హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి సర్వశక్తులూ ఒడ్డుతోందిక్కడ. అదే సమయంలో బీజేపీ తరఫున ఢిల్లీ నాయకత్వం, హుజూరాబాద్ ఉప ఎన్నికని లైట్ తీసుకున్నట్లే కనిపిస్తోంది.
బద్వేలు విషయానికొస్తే, బీజేపీ కనీసం డిపాజిట్లు తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు. మిత్రపక్షం జనసేన కూడా బీజేపీని పట్టించుకోవడంలేదు. వాస్తవానికి బద్వేలులో పోటీ అవకాశాన్ని బీజేపీ, జనసేనకే తొలుత వదిలేసింది.
అయితే, దీనిపై అధికారిక ప్రకటన రాకముందే, జనసేనాని వ్యూహాత్మకంగా వ్యవహరించి.. తాము పోటీ చేయడంలేదని ప్రకటించేస్తూ, ‘సిట్టింగ్ ఎమ్మెల్యే అకాల మరణంతో వచ్చిన ఉప ఎన్నికలో ఆ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులే పోటీ చేస్తున్నందున ఈ నిర్ణయం..’ అంటూ పేర్కొన్నారు జనసేన అధినేత.
అలా బీజేపీ ఇక్కడ ఒంటరి అయిపోయింది. జాతీయ నాయకత్వం అస్సలు బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికని పట్టించుకోకపోవడంతో ఏపీ బీజేపీ నేతలు ఎంతగా గింజుకుంటున్నా నియోజకవర్గంలో జనం ఎవరూ బీజేపీని కనీసం లెక్కచేయడంలేదు.