ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో నడుస్తున్న పెద్ద చర్చ ప్రెసిడెంట్ పదవికి ఎవరికి ఇవ్వాలి అని. గత ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుండి కొన్ని పాఠాలు నేర్చుకున్న చంద్రబాబు నాయుడు పార్టీ అధ్యక్షుడిని మార్చాలని డిసైడ్ అయ్యారు. అప్పుడే పార్టీకి కొత్త జవసత్వాలు వస్తాయని గట్టిగా నమ్ముతున్నారు ఆయన. సాధారణంగా అయితే ఈ పదవికి ముందుగా పోటీలో ఉండవలసింది చంద్రబాబు తనయుడు నారా లోకేష్. ఆయనే అందరికంటే ముందుండి పార్టీ పగ్గాలు పట్టుకోవడానికి సిద్దపడాలి. కానీ ఆ పరిస్థితి లేకపోవడంతో చంద్రబాబు ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్నారు. ఈ వెతుకులాటలో ఆయనకు రామ్మోహన్ నాయుడు, పరిటాల శ్రీరామ్ లాంటి యువనాయకుల పేర్లు వినబడినా చివరకు అచ్చెన్నాయుడును ప్రెసిడెంట్ పదవికి ఎన్నిక చేయాలని బాబుగారు భావిస్తున్నారట.
అవినీతి ఆరోపణలతో జైలుకెళ్లి, ఆరోగ్యం దెబ్బతిని నానా అగచాట్లు పడిన అచ్చెన్నాయుడుకు ఈ ప్రెసిడెంట్ పదవి కొద్దిగా ఊరటనిస్తుందని బాబుగారు ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ టీడీపీ దాదాపుగా కుప్పకూలిన పరిస్థితిలో ఉంది. ఇలాంటి స్థితిలో పార్టీని మోయడం, బాగుచేయడం అంటే చాలా కష్టం. ప్రతి నియోజకవర్గాన్ని చక్కబెట్టుకుంటూ రావాలి. అయితే ఈ ముళ్లకిరీటం మీద అచ్చెన్నాయుడు అంత ఆసక్తిగా ఉన్నట్టు కనబడటంలేదు. ఏదో చంద్రబాబు తీసుకోమన్నారనే గౌరవంతో తీసుకుంటున్నట్టున్నారు తప్ప కావాలని పట్టుబట్టి తీసుకోవట్లేదు. అయితే పార్టీలో మరొక వ్యక్తి మాత్రం ఈ ప్రెసిడెంట్ పదవిని అలంకరించాలనే ఆసక్తితో ఉన్నట్టు కనిపిస్తున్నారు.
ఆయన మరెవరో కాదు.. చింతకాయల అయ్యన్నపాత్రుడు. నిజానికి టీడీపీలో ఈయన చాలా సీనియర్ నాయకుడు. దాదాపు అన్ని విషయాల మీద ఆయనకు అవగాహన ఉంది. ఏం చేస్తే ఏమవుతుంది, ఏ పని ఎలాంటి ఫలితాలను అందిస్తుంది అనేది బాగా తెలిసిన నాయకుడు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత ఆయనది. బాబుగారి హయాంలో క్యాబినెట్ మంత్రిగా కూడ పనిచేశారు. ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు చెప్పటం ఆయన స్టైల్. అది సొంతవారికైనా, బయటివారికైనా. ఈమధ్య ఆయన జగన్ సర్కార్ మీద గట్టిగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నడూ ఆయన్ను ఇంత అగ్రెసివ్ గా చూసింది లేదు. ఆయనకు తెలిసిందల్లా సైలెంట్ రాజకీయాలే. కానీ ఇప్పుడు గొంతు పెంచుతున్నారు. ఆయనలోని ఈ మార్పుకు కారణం ప్రెసిడెంట్ పదవి మీద కోరికేనని, కాబట్టి అంతగా ఇష్టం లేని అచ్చెన్నాయుడికి ఇచ్చే బదులు ఆ ముళ్ల కిరీటమేదో అయ్యన్నకే పెట్టవచ్చు కదా అంటున్నారు చాలామంది.