రెచ్చిపోయిన సిరాజ్ , ఆస్ట్రేలియా ఆలౌట్ ..భారత్ టార్గెట్ ఎంతంటే ?

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టులో రసవత్తరంగా ముందుకు సాగుతుంది. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో‌ 294 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీనితో ఓవరాల్‌గా టీమిండియా ముందు 328 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 21/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. మహ్మద్‌ సిరాజ్‌ ఐదు వికెట్లు ఖాతాలో వేసుకుని కెరీర్లో ఉత్తమ గణాంకాలు నమోదు చేశాడు. శార్దూల్‌ ఠాకూర్‌ 4, వాషింగ్టన్‌ సుందర్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు.

ఆసీస్‌ ఓపెనర్లు మార్కస్‌ హేరిస్‌ (38) డేవిడ్‌ వార్నర్‌ (48) రాణించారు. వారితో తోడు స్టీవ్‌ స్మిత్‌, కామెరూన్‌ గ్రీన్‌ (37) కూడా పరుగులు జోడించడంతో ఆతిథ్య జట్టు భారీ స్కోరు సాధించింది.నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన ఆస్ట్రేలియా జట్టుకు భారత్ ఆదిలోనే షాక్ ఇచ్చింది. నిలకడ ఆడుతున్న ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్(48), మార్కస్ హారిస్(38)లను వెంటవెంటనే ఔట్ చేసిన టీమిండియా బౌలర్లు.. కొద్దిసేపటికే ఇన్‌ఫామ్ బ్యాట్స్‌మెన్ లబూషేన్‌(25), వేడ్(0)లను కూడా పెవిలియన్ బాట పట్టించారు.

ఆ తర్వాత స్మిత్, గ్రీన్ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అయితే, హాఫ్ సెంచరీ చేసి ఊపు మీదున్న స్మిత్ ను సిరాజ్ బోల్తా కొట్టించాడు.బౌన్సర్‌ అంచనా వేయడంలో విఫలమైన స్మిత్.. అజింక్య రహానే చేతికి చిక్కాడు. గ్రీన్‌-స్మిత్ అయిదో వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆఖర్లో కమిన్స్, లయన్ కొంచెం సేపు తమ బ్యాట్ కు పని చెప్పడంతో ఆస్ట్రేలియా 294 పరుగులు చేసింది. హాజెల్ వుడ్ ఆఖర్లో సిరాజ్ ఔట్ చేయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ తో కలుపుకుని ఆస్ట్రేలియా 328 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. అయితే, ఈ మ్యాచ్ కు వరుణుడు అడ్డంకిగా మారాడు. 328 పరుగుల టార్గెట్ తో టీమిండియా ఓపెనర్లు బరిలోకి దిగారు. 4 పరుగులు చేసిన వెంటనే వరుణడు ఎంట్రీ ఇవ్వడంతో ఆటను నిలిపివేశారు అంపైర్లు.