ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత కొద్ది రోజుల నుంచి రికార్డ్ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతుండగా, అదే స్థాయిలో కరోనా మరణాలు కూడా జరుగుతున్నాయి. అయితే కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమవుతుందని, రోగులకు సరైన చికిత్స అందించడంలేదని టీడీపీ, బీజేపీలు వైసీపీ సర్కార్‌పై విమర్శలు చేస్తూనే ఉన్నాయి.
అయితే దేశంలో కరోనా కేసులలో ఏపీనే ముందంజలో ఉందని, కరోనా రోగులకు అవసరమైన చికిత్స, మంచి పోషకాలు కలిగిన ఆహారం అందిస్తున్నామని వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నా తాజాగా లీకైన ఓ ఆడియో కాల్ వింటుంటే మాత్రం క్షేత్ర స్థాయిలో వైసీపీ సర్కార్ చెబుతున్నట్టు లేదనే అనిపిస్తుంది.
తాడిపత్రి ఆర్టీసీ డిపో మేనేజర్ నరేంద్ర రెడ్డికి కరోనా సోకగా ఆయన పడిన ఇబ్బందులను ఓ ఆడియో రూపంలో బయటపెట్టాడు. ఈ ఆడియో కాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తనకు కరోనా సోకిందని అంబులెన్స్‌కి కాల్ చేస్తే చాలా ఆలస్యంగా వచ్చిందని, తనను ఎక్కించుకున్న అనంతరం మరికొంత మంది రోగులను కూడా అదే అంబులెన్స్‌లో ఎక్కించుకున్నారని ఆ తరువాత ఊరంతా తిరిగి ఎస్కేయూ వద్దకి తీసుకెళ్ళి అక్కడ ఓ బ్లాక్‌లో ఉంచారని, అక్కడ తినడానికి తిండి కూడా సరిగ్గా ఇవ్వడం లేదని తాను పడిన ఇబ్బందులను చెబుతూ దయచేసి ఎవరూ కరోనా బారిన పడకండి అంటూ అందులో మాట్లాడాడు.