Crime News:ఈ మధ్యకాలంలో మోసాలు, భూకబ్జాలు విపరీతంగా పెరిగిపోయాయి. హైదరాబాద్ ఉప్పల్ లో ముగ్గురు మహిళలు కలిసి ఒక ఫ్లాట్ మీద కన్ను వేశారు. 267 గజాల స్థలాన్ని దొంగ డాక్యుమెంట్లు సృష్టించి, సంతకాలు ఫోర్జరీ చేసి, రిజిస్ట్రేషన్ చేయించుకుని కటకటాల పాలయ్యారు. ఇన్స్పెక్టర్ గోవింద రెడ్డి గారు తెలిపిన మేరకు…. సరూర్ నగర్ మండలం ఆర్కే పురానికి చెందిన పచ్చి పులుసు వరలక్ష్మి కుమారి 1983 లో శ్రీ రమణ కోపరేటివ్ సొసైటీ నుండి రామంతపూర్ లోని శ్రీరమణపురం లో 267 గజాల స్థలాన్ని కొనుగోలు చేసింది. శ్రీ రమణ కో-ఆపరేటివ్ సొసైటీ నుండి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంది. వరలక్ష్మీ భర్త మల్లికార్జున రావు 2011లో మృతిచెందడంతో అప్పటి నుండి ఆమె సోదరుడు మల్లేశ్వరరావు స్థలాన్ని చూసుకుంటున్నాడు.
ఉప్పల్ డివిజన్లోని చర్చి కాలనీ లో ఉండే పసల జ్యోతికి ఈ స్థలం మీద కన్ను పడింది. ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి పన్నాగం పన్ని 2014లో వరలక్ష్మి చనిపోయినట్టు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బయ్యారం నుండి డెత్ సర్టిఫికెట్ ని సృష్టించారు. వరలక్ష్మి ఏకైక కూతురిని తానే అంటూ అందరిని నమ్మించే ప్రయత్నం చేసింది జ్యోతి. ఆధార్ కార్డ్ లో కూడా తన తండ్రి విజయ కుమార్ పేరు ను తొలగించి మల్లికార్జున రావు పేరుని ఎడిట్ చేసింది. 2021 డిసెంబర్ 3వ తేదీన జ్యోతి తన కూతురు వెన్నెల (19) కి గిఫ్ట్ డీడ్ చేసింది. వెన్నెల అదే నెల 9వ తారీఖున గొల్లపూడి మరియమ్మ కు సేల్ డీడ్ చేసింది. అంతటితో ఆగకుండా గొల్లపూడి మరియమ్మ తిరిగి పసల జ్యోతి మరియు చిలుకా నగర్ లోని ఆదర్శ నగర్ కు చెందిన బల్ల జ్యోతి (27) కి సేల్ డీడ్ చేసింది.
ఇటీవల వరలక్ష్మి కుటుంబీకులు ప్లాట్ దగ్గరికి రాగా జ్యోతి కి సంబంధించిన వారు ఈ ప్లాట్ తమదని వారించారు. వరలక్ష్మి కుటుంబీకులు రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్లి ఆరా తీయగా అసలు విషయం బయటకు వచ్చింది. వరలక్ష్మి కి కూతురు, కుమారుడు ఉన్నారు. వీరు వెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా పోలీసుల విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వరలక్ష్మి మరణించినట్టు బయ్యారం గ్రామ పంచాయితీ ఇచ్చిన మరణ ధృవీకరణ పత్రం నకీలదని పోలీసులు తేల్చారు. పంచాయితీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసినట్టు గుర్తించారు. ప్లాట్ కబ్జా కేసులో శుక్రవారం పసాల జ్యోతి, ఆమె కూతురు వెన్నెల, బల్ల జ్యోతిని అరెస్ట్ చేశారు.