భూ గ్రహంపై మొదట ఏర్పడిన ల్యాండ్ ఇదేనంట.. ఏ దేశంలో ఉందో తెలుసా..?

మనకు తెలిసిన భూమి రూపం పర్వతాలు, నదులు, సముద్రాలు, అడవులు.. ఇవన్నీ కోట్ల సంవత్సరాల పరిణామ క్రమం ఫలితమే. కానీ ఈ అద్భుతమైన నీలి గ్రహం మొదటగా ఎలా ఉండిందో ఎప్పుడైనా ఆలోచించారా.. ఒకప్పుడు భూమి పూర్తిగా నీటిలో మునిగిపోయి ఉండేదని శాస్త్రవేత్తలు చెబుతారు. ఆ అనంత సముద్రాల మధ్య ఎక్కడో ఒకచోట మొదటి భూమి భాగం గాలికి బహిర్గతమైందని.. అదే మనకు తెలిసిన భూభాగం అని చెబుతున్నారు.

తాజాగా వెలుగుచూసిన ఒక సెన్సేషన్ విషయం ఏమిటంటే.. భూమిపై మొట్టమొదటగా బయటపడిన నేల భారత్‌లోనే ఉనికిలోకి వచ్చిందని తేలింది. ఈ రహస్యం జార్ఖండ్ రాష్ట్రంలోని సింగ్‌బం క్రాటాన్ ప్రాంతంలో దాగి ఉంది. ఇక్కడ శాస్త్రవేత్తలు కనుగొన్న 3.2 బిలియన్ సంవత్సరాల వయసున్న ఇసుకరాళ్లు ప్రపంచ భూభౌతిక శాస్త్ర చరిత్రలో విప్లవాత్మక మార్పును తెచ్చాయి.

సింగ్‌బం క్రాటాన్‌ భూగర్భ ఖజానా: సింగ్‌బం అనేది భూగర్భ శాస్త్రంలో “క్రాటాన్”‌గా పిలువబడే ప్రాచీన భూభాగం. ఇది భూమి మొదటి ఖండాంతర క్రస్ట్‌లలో ఒకటిగా భావించబడుతోంది. ఇక్కడి రాళ్లలో కనిపించే అలల ఆకృతులు, నది ప్రవాహ మార్గాలు, బీచ్‌ మైదానాల ఆనవాళ్లు ఇవన్నీ ఒకే విషయాన్ని చెబుతున్నాయి.. ఈ ప్రాంతం ఒకప్పుడు సముద్ర మట్టానికి పైగా ఉండేది.

ఇంత వరకు శాస్త్రవేత్తలు భూమిపై తొలి నేల సుమారు 2.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఉద్భవించిందని భావించేవారు. కానీ ఈ తాజా వివరాలు ఆ అంచనాలను తలకిందులు చేసింది. అమెరికా, భారత్, ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు చేసిన విస్తృత భూగర్భ రసాయన విశ్లేషణ ద్వారా ఈ ఇసుకరాళ్లు కనీసం 3.2 బిలియన్ సంవత్సరాల వయసు కలిగి ఉన్నట్లు నిర్ధారించారు.

భూమి పరిణామక్రమం పై కొత్త అధ్యాయం: ఈ పరిశోధన ప్రకారం, సింగ్‌బం ప్రాంతంలో ఒకప్పుడు అగ్నిపర్వతాలు విరజిమ్మిన లావా కోట్ల సంవత్సరాల పాటు చల్లబడుతూ ఘనమైన రాతి పొరలుగా మారింది. భూభాగం తేలికగా ఉండడం వల్ల అది సముద్ర జలాల నుంచి పైకి లేచి మొదటి భూభాగంగా వెలిసింది. ఈ సమయంలో గాలులు, వర్షాలు, వాతావరణ మార్పులు రాళ్లను క్రమంగా దెబ్బతీసి ఇసుకరాళ్లుగా మార్చాయి. అదే మనం ఇప్పుడు చూస్తున్న ప్రాచీన రాళ్లుగా మిగిలిపోయాయి.

ఈ భూమి చరిత్రను మళ్లీ రాయించేంత ప్రాధాన్యం కలిగింది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా, ఆఫ్రికా వంటి ప్రాంతాలను ప్రాచీన భూభాగాల పుట్టుక స్థలాలుగా పరిగణించినా, ఇప్పుడు భారత్ కూడా ఆ జాబితాలో అగ్రస్థానంలోకి వచ్చింది. సింగ్‌బం రాళ్లు మన దేశానికి భూగర్భ శాస్త్రంలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ఈ ఫలితాల ఆధారంగా, శాస్త్రవేత్తలు భూమి మొదటి ఖండాల ఏర్పాటుపై మరింత లోతైన అధ్యయనం చేయాలని భావిస్తున్నారు. భూమి వాతావరణం, జీవం పుట్టుక, ఖండాల కదలికలపై ఈ రాళ్లు కీలక సమాచారాన్ని అందించవచ్చు. వీటిని అధ్యయనం చేయడం ద్వారా మనం భూమి యొక్క మొదటి జీవన అనుకూల పరిస్థితుల గురించి మరింత తెలుసుకోవచ్చు.

ఇలాంటి సమాచారం కేవలం శాస్త్రీయ ఆసక్తి మాత్రమే కాదు.. ఇవి మన భూమి ఎలా పుట్టింది, ఎలా మారింది, మనకు తెలిసిన జీవం ఎలా ఏర్పడింది అనే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాయి. భూమి చరిత్రలో ఒక కొత్త పేజీని ఈ జార్ఖండ్ రాళ్లు తెరిచాయి అనడం అతిశయోక్తి లేదు.