తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ళ పంచాయితీపై సీజేఐ సలహా.!

తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ళ పంచాయితీ విషయమై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ ఎన్.వి. రమణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ, సమస్యను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని ఇరు రాష్ట్రాలకు చెందిన న్యాయవాదులకు సూచించారు. తాను రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినవాడిననీ, సమస్యకు సానుకూల పరిష్కారాన్ని ఆశిస్తున్నాననీ చెప్పారు. కాగా, కేంద్రం ఇప్పటికే గెజిట్ విడుదల చేసినందున, విచారణ అవసరం లేదని తెలంగాణ తరఫు న్యాయవాది అభిప్రాయపడ్డారు. కానీ, గెజిట్.. అమల్లోకి వచ్చేలోపు.. అంటే, నాలుగు నెలల కాలానికిగాను, నీటి పంపకాలపై తమకు అన్యాయం జరుగుతోందని ఏపీ వాదిస్తోంది.

ఈ నేపథ్యంలో కేసు విచారణ కొనసాగించాలనుకుంటే, వేరే ధర్మాసనానికి కేసు విచారణను బదిలీ చేయనున్నట్లు జస్టిస్ ఎన్వీ రమణ వెల్లడించారు. విచారణ ఎల్లుండికి వాయిదా పడింది. కృష్ణా నది నుంచి తెలంగాణ ప్రభుత్వం అడ్డగోలుగా విద్యుత్ ఉత్పత్తి ద్వారా నీటిని వృధా చేస్తోందన్నది ఆంధ్రప్రదేశ్ ఆరోపణ. మరోపక్క, ఆంధ్రప్రదేశ్ అడ్డగోలుగా ఎత్తిపోతల పథకాలు చేపడుతోందని తెలంగాణ ఆరోపిస్తోంది. ఈ గందరగోళం నడుమ, ఇటీవల కేంద్రం, ఇరు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలకు సంబంధించి కృష్ణా అలాగే గోదావరి నదుల పరిధిలో ఆయా బోర్డుల్ని ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల చేసింది. అయితే, బోర్డుల ఏర్పాటుని ఆంధ్రప్రదేశ్ స్వాగతించగా, ఏకపక్ష నిర్ణయాలు కేంద్రం తీసుకోవడం తగదంటూ తెలంగాణ మండిపడుతున్న విషయం విదితమే. పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల వ్యవహారంపై తెలంగాణ అభ్యంతరాలు చెబుతోంటే, తెలంగాణలో నిర్మితమవుతున్న చాలా ఎత్తిపోతల పథకాలపై ఏపీకి అభ్యంతరాలున్నాయి.