తదుపరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా, మన తెలుగు వ్యక్తి జస్టిస్ ఎన్వీ రమణ నియామకం ఖాయమైపోయింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.. ఈ మేరకు ఆమోద ముద్ర వేసేశారు. ప్రస్తుత చీఫ్ జస్టిస్ బాబ్డే, కేంద్ర న్యాయ శాఖకు.. తదుపరి చీఫ్ జస్టిస్ పదవి కోసం జస్టిస్ ఎన్వీ రమణ పేరుని ఇటీవల ప్రతిపాదించిన విషయం విదితమే. జస్టిస్ ఎన్వీ రమణ మన తెలుగువారే. న్యాయ వ్యవస్థలో ఒక్కో మెట్టూ ఎదిగి, అత్యున్నత స్థానానికి చేరుకున్నారాయన. ఈ క్రమంలో ఆయన చుట్టూ కొన్ని వివాదాలూ లేకపోలేదు.
ప్రధానంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎన్వీ రమణకు చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలున్నాయని ఆరోపిస్తూ, ఎన్వీ రమణ కుటుంబ సభ్యులకు అమరావతి కుంభకోణంతో లింకులున్నాయని ఆరోపించారు. అంతే కాదు, జస్టిస్ ఎన్వీ రమణ.. న్యాయ వ్యవస్థను ప్రభావితం చేసేలా వ్యవహరించారనీ, రాష్ట్ర ప్రభుత్వానికి ఆయా కేసుల విచారణ సందర్భంగా కోర్టుల్లో చుక్కెదురవడానికి పరోక్షంగా ఎన్వీ రమణ కారణమయ్యారనీ ఆరోపిస్తూ ఏకంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బాబ్డేకి ఫిర్యాదు కూడా చేశారు. ఆ ఫిర్యాదుని ఇటీవలే సుప్రీంకోర్టు అంతర్గత విచారణ కమిటీ కొట్టి పారేసింది. జస్టిస్ ఎన్వీ రమణకు క్లీన్ చిట్ ఇస్తూ, ఆయన పేరుని తదుపరి చీఫ్ జస్టిస్ పదవి కోసం బాబ్డే ప్రతిపాదించడమూ జరిగిపోయింది. వివాదాల సంగతి పక్కన పెడితే, మన తెలుగు వ్యక్తి.. సర్వోన్నత న్యాయస్థానానికి చీఫ్ జస్టిస్ అవడం మన తెలుగువారందరికీ గర్వకారణం.