ప్రస్తుత కాలంలో డబ్బుకు ఉన్న విలువ బంధాలకు బంధుత్వాలకు లేకుండా పోయింది. డబ్బు కోసం కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఏర్పడుతున్నాయి
ఈ క్రమంలో తల్లితండ్రులు బంధుమిత్రులు అని చూడకుండా దాడులకు పాల్పడుతున్నారు. ఆస్తికోసం నవ మాసాలు మోసి,కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల మీద కనికరం లేకుండా ఇంటి నుండి బయటకు గెంటేస్తున్నారు. మరికొంతమంది రాక్షసంగా ప్రవర్తిస్తూ వారి మీద దాడులకు దిగుతున్నారు.తాజాగా ఒక వ్యక్తి ఆస్తి కోసం సొంత తల్లి తండ్రులను ఇంట్లో ఉండకుండా వారిని బయటకి పంపి ఇంటికి తాళం వేశాడు. వృద్దాప్యంలో తల్లితండ్రుల బాగోగులు చూడవలసిన కన్న కొడుకు వారిని కొట్టి ఇంటికి తాళం వేశాడు.
ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రం లోని మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పెద్ద ఆదిరాల గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ గ్రామంలో నివశిస్తున్న బీరయ్య, తిరుపతమ్మ లకు ఇద్దరు కుమారులు. వీరి వివాహ అనంతరం ఇద్దరు కుమారులు తల్లితండ్రులను వదిలేసి వేరు కాపురం పెట్టారు. వీరికి మొత్తం 18 ఎకరాలు పొలం ఉండగా అందులో రెండు సంవత్సరాల క్రితం ఇద్దరి కొడుకులకు ఒక్కొక్కరికి 5 ఎకరాలు పంచి ఇచ్చి మిగిలిన 8 ఎకరాలు వృద్ద దంపతులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో చిన్న కుమారుడు మల్లేష్ ఏడాది నుండి తరచూ తల్లిదండ్రుల వద్దకు వచ్చి మిగిలిన 8 ఎకరాల భూమి కోసం వేధిస్తున్నాడు.
రోజు రాత్రి వేల వచ్చి 8 ఎకరాల భూమి నీ తన పేర రాయాలి అని గొడవ పడేవాడు. దీంతో తల్లిదండ్రులు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టగా…. తాము బ్రతికున్నంత కాలం తమ జీవనాధారం కోసం భూమి సాగు చేసుకుంటాం అని, తమ మరణానంతరం ఇద్దరు కుమారులు ఆ భూమి ని సమానంగా తీసుకోవాలి అని తెలిపారు. అయినా సరే మల్లేష్ లో ఎటువంటి మార్పు రాలేదు. వారం రోజుల క్రితం ఇంటికి వచ్చిన మల్లేష్, ఆస్తి తన పేరును వచ్చేవరకు ఇంట్లో ఉండొద్దని తల్లిదండ్రులను ఇద్దరినీ కొట్టి, బయటకు పంపి, ఇంటికి తాళం వేశాడు. తిరిగి ఇంటికి వెళ్తే కొట్టి చంపుతాడు అనే భయం తో ఇంటికి వెళ్లలేదని వృద్దులు కన్నీరుమున్నీరవుతున్నారు. వారం రోజుల నుండి చుట్టు పక్కల గ్రామాలలోని గుడులు, సత్రాలలో తల దాచుకున్నాము అని తెలిపారు. కొడుకుతో ప్రాణ హాని ఉంది అని జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.