దేశం ఎంత అభివృద్ధి చెందినా కూడా కొంతమంది ప్రజలు మాత్రం మూఢనమ్మకాలను బలంగా నమ్ముతున్నారు. మూడనమ్మకాల పేరుతో దారుణాలకు పాల్పడుతున్నారు. ఇటీవల మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మూడనమ్మకంతో 5 ఏళ్ల చిన్నారికి దయ్యం వడిలించటానికి క్షుద్ర పూజలు చేసి దారుణంగా కొట్టి చంపిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు.
వివరాలలోకి వెళితే…మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో సుభాష్ నగర్‌కు చెందిన సిద్ధార్థ్ చిమ్నే, రంజన దంపతులకు ఇద్దరు కుమార్తెలు. గత నెల గురు పూర్ణిమ సందర్భంగా సిద్ధార్థ్ చిమ్నే తన భార్య పిల్లలతో కలిసి తకల్‌ఘాట్ ప్రాంతంలోని దర్గాకు వెళ్లాడు. ఆ సమయం నుండి సిద్ధార్థ చిన్న కుమార్తె ప్రవర్తనలో మార్పు రావడం కుటుంబ సభ్యులు గమనించారు. ఈ క్రమంలో ఐదేళ్ల చిన్నారికి దుష్టశక్తులు ఆవహించాయని కుటుంబ సభ్యులు బలంగా నమ్మారు. దుష్టశక్తులను తరిమికొట్టేందుకు చేతబడి చేయించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఐదేళ్ల చిన్నారి తల్లిదండ్రులతో పాటు అత్త రాత్రిపూట చేతబడి చేయించడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఆ కార్యక్రమాన్ని సెల్ ఫోన్లు వీడియో కూడా తీసినట్టు పోలీసులు వెల్లడించారు.
ఆ వీడియోలో చిన్నారి ఏడుస్తున్న సమయంలో ఈ ఘటనకు పాల్పడిన నిందితులు కొన్ని ప్రశ్నలు అడగటంతో బాలిక సమాధానాలు చెప్పలేక పోయిందని పోలీసులు వెల్లడించారు. ఆ సమయంలో చిన్నారి తల్లిదండ్రులతో పాటు ఆమె అత్త కూడా దారుణంగా బాలికను కొట్టి హింసించారని దీంతో బాలిక స్పృహతప్పి నేలపై పడిపోయిందని అధికారులు తెలియచేశారు. బాలిక స్పృహ తప్పి పడిపోవడంతో శనివారం ఉదయం బాలిక తల్లిదండ్రులు ఆమెను దర్గాకు తీసుకువెళ్లారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ నుండి కనిపించకుండా పరారయ్యారు.
వీరి ప్రవర్తన మీద అనుమానం వచ్చిన సెక్యూరిటీగా వారు ప్రయాణిస్తున్న కారుని ఫోటో తీశాడు. ఆస్పత్రిలో చేర్పించిన బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కారు రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మూఢనమ్మకాల పేరిట ఐదేళ్ల చిన్నారిపై క్షుద్ర పూజలు చేసి చిన్నారి ప్రాణాలు తీసిన ఘటన నాగపూర్ లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు పాల్పడిన చిన్నారి తల్లిదండ్రులతోపాటు చిన్నారి అత్తను కూడా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.